రైతులను ఎండబెట్టడమే రేవంత్ వ్యూహం.. మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-05 06:22:06  IST  )

కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనను అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

రైతులను ఎండబెట్టడమే రేవంత్ వ్యూహం.. మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: నీళ్లు ఇవ్వకుండా రైతలను ఎండబెట్టాలనే వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ముందుకు వెళ్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనకు వెళ్తున్న ఆయనను పోలీసులు జనగాం జిల్లా పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇవాల కన్నెపల్లి దగ్గర ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలోకి వృథాగా పోతోందని అన్నారు. కింద అంత నీరు వృథాగా పోతుంటే, పైన ఉన్న మిడ్ మానేరు, కాళేశ్వరం సహా ప్రాజెక్టులోని ప్రతి రిజర్వాయర్ నోరెళ్లబెట్టి చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎక్కడా నీళ్లు లేక రైతులు కనీసం నాట్లు వేసే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఈ ప్రభుత్వ దుర్మార్గమైన వైఖరిని తెలంగాణ రైతాంగానికి కళ్లారా చూపెట్టడానికే తాము ఇవాళ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేదు..

మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) గేట్లతో సంబంధం లేకుండా, 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు.. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వవచ్చని కేటీఆర్ అన్నారు. దీంతో రైతులు నాట్లు వేసుకోవచ్చని, తెలంగాణను సస్యశ్యామలం చేసేలా కేసీఆర్ అన్ని ప్రాజెక్టును డిజైన్ చేశారని పేర్కొన్నారు. ఆ నిజాన్ని ప్రజల మందుకు పెట్టేందుకు వెళ్తుంటే.. నేడు మమ్మల్ని జనగాంలోనే అడ్డుకుంటున్నాని, ప్రభుత్వానికి అంత భయం ఎందుకో అని కేటీఆర్ ప్రశ్నించారు. చేతగాని సీఎం ఆలోచన.. ఒకవేళ పంటలకు నీళ్లిస్తే మళ్లీ యూరియా ఇవ్వాలి, పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలనే రైతులను ఎండబెడుతున్నారని సెటైర్లు వేశారు. ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన ఎక్కడ బయటపడుతుందనే భయంతో రేవంత్ రెడ్డి అనే సన్నాసి సూచనల మేరకే పోలీసులు తనకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కచ్చితంగా కన్నెపల్లికి పోతాం..

అయితే, పోలీసుల ఆంక్షలపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి దమ్ముంటే, చేతనైతే మంచి పనులు చేసి ప్రజల ముందుకొచ్చి గెలవాలని సవాలు విసిరారు. ఎవరు ఎన్నిక అడ్డంకుడు సృష్టించినా.. కన్నెపల్లి (Kallepalli)కి చేరుకుని తీరుతామని స్పష్టం చేశారు. అక్కడ ప్రవహిస్తున్న లక్ష క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతామని, తెలంగాణలో ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో ప్రజలందరికీ వివరిస్తామని కేటీఆర్ అన్నారు.

Next Story