పేరుకుపోయిన చెత్తతో ప్రజలు అవస్థలు

by Ratna Kumari |

కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య లోపం ప్రజలకు శాపంగా మారింది. వర్షాకాలం ఆరంభంతోనే పట్టణం అంతటా చెత్త కుప్పలు పేరుకుపోయి అంటు వ్యాధులకు నిలయంగా మారింది.

పేరుకుపోయిన చెత్తతో ప్రజలు అవస్థలు
X

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి పట్టణ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య లోపం ప్రజలకు శాపంగా మారింది. వర్షాకాలం ఆరంభంతోనే పట్టణం అంతటా చెత్త కుప్పలు పేరుకుపోయి అంటు వ్యాధులకు నిలయంగా మారింది.

ప్రధాన రహదారులే చెత్త కుప్పలు ..

పట్టణంలోని ప్రధాన రహదారులే చెత్తతో అధ్వానంగా ఉంటే, వార్డుల్లోని గల్లీల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వివిధ కాలనీలు, వార్డుల్లో రోజుల తరబడి చెత్త తీయకపోవడంతో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఫలితంగా స్థానికులు జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధుల బారిన పడుతున్నారు.

ప్లాస్టిక్ తిని మూగజీవులు ప్రాణాల మీదకు ..

ప్రధాన రహదారుల పక్కన, దుకాణాల ముందు ప్లాస్టిక్ సంచులు, కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థాలు రాశులుగా పడి ఉన్నాయి. చెత్తను తినేందుకు ఆవులు, దూడలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్లాస్టిక్ తిని మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో మూగజీవులకు ముప్పు పొంచి ఉంది.

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ..

ప్రధాన రహదారులపై చెత్త కుప్పలు కనిపిస్తుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. చెత్త తరలింపు వాహనాలు సక్రమంగా తిరగకపోవడం, పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో పట్టణ పరిశుభ్రత పూర్తిగా దిగజారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంటు వ్యాధుల హెచ్చరిక..

వర్షాలు మొదలైన నేపథ్యంలో మురుగు కాలువలు పూడుకుపోయి దోమలు పెరిగి మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే అన్ని వార్డుల్లో చెత్త తరలింపు ముమ్మరం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Next Story