డబుల్ రోడ్డు కోసం ప్రజల నిరీక్షణ

by Jakkula.Mamatha |

డబుల్ రోడ్డు నిర్మాణం హామీలకే పరిమితం అవుతుంది.

డబుల్ రోడ్డు కోసం ప్రజల నిరీక్షణ
X

దిశ, తిరుమలగిరి(సాగర్): డబుల్ రోడ్డు నిర్మాణం హామీలకే పరిమితం అవుతుంది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం తొమ్మిది సంవత్సరాలుగా మండల ప్రజలు నిరీక్షణగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న కానీ ప్రజల చిరకాల వాంఛ మాత్రం తీరడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. హామీలు కాగితాలకే పరిమితం చేయకుండా అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది.

సింగిల్ రోడ్డు తో నరకయాతన..

అసలే సింగల్ రోడ్డు.. ఆ రోడ్డు పై ప్రయాణం చెయ్యాలంటే ఎదురుగా వస్తున్న వాహనం రోడ్డు దిగితే గానీ.. మరొక వాహనం వెళ్ళడానికి అవకాశం లేదు.2016 లో తిరుమలగిరి కొత్త మండలం కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. ఆ రోడ్డుకు ఒక వైపు డొక్కల బాయి తండా నుంచి అల్వాల వరకు కేబుల్ వైర్ కోసం మోకాళ్ళ లోతు గుంతలు తీసి కేబుల్ వైర్ వేసి పూడ్చారు. గుంతల రోడ్డుకు అధికారులు కొంత మరమ్మతులు చేసి మరి కొంత మరిచారు. వర్షాలు వచ్చినప్పుడు రోడ్డు పై ప్రయాణం చేసే భారీ వాహనాలు రోడ్డు దిగితే మరల రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు.దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వాహనాల రద్దీతో రోడ్లు మొత్తం గుంతల మయంగా తయారయ్యాయి. రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు.

హామీలకే పరిమితం అవుతున్న డబుల్ రోడ్డు నిర్మాణం

నూతన మండలం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అదిగో రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం.. ఇదిగో రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని అధికారులు ప్రజాప్రతినిధులు మీటింగ్ లలో మాటలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపడుతుందని ఆశగా చూసిన ప్రజలు.. వారి ఆశలు అడియాశలయ్యాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రోడ్డు రూపురేఖలు మారుతాయని మండల వ్యాప్తంగా చర్చ సాగింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావొస్తుంది. మండల కేంద్రం మీదుగా డబుల్ రోడ్డు శాంక్షన్ అయినట్టు ప్రజాప్రతినిధులు అధికారులు తెలుపుతున్నప్పటికీ నిర్మాణానికి మాత్రం నోచుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది.

పెరిగిన భారీ వాహనాల రాకపోకలు..

ఈ రహదారి గుండా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న థర్మల్ ప్లాంట్ కు,నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిమిత్తం భారీ వాహనలతో రాకపోకలు రద్దీ పెరిగింది.ప్రజా ప్రతినిధులు అదిగో డబల్ రోడ్డు.. ఇదిగో డబల్ రోడ్డు అంటున్నారే తప్ప ఐదు సంవత్సరాలుగా అమలుకు మాత్రం అది కార్యరూపం దాల్చడం లేదని విమర్శలు మండలం వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.ఈ రహదారి పై నిత్యం వాహనాల రాకపోకలు విపరీతంగా పెరగడంతో ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయింది.

గుంతలుగా మారిన.. లో లెవెల్ కల్వర్టులు

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రధాన రహదారి మీదుగా వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం వుంది.గతంలో కురిసిన వర్షాలకు ప్రధాన రహదారిపై ఉన్న లో - లెవెల్ కల్వర్టుల వద్ద వాగులు పారడంతో ఆ ప్రాంతాల వద్ద రోడ్డు డ్యామేజ్ అయ్యాయి. అల్వాల ఎక్స్ రోడ్ నుంచి తిరుమలగిరి వరకు ప్రధాన రహదారి గుంతల మయంగా తయారు కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.నిన్న మొన్న వచ్చిన వర్షాలకు ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో వాహనాలు వెళ్లడానికి అసౌకర్యంగా ఉంది.

దీనికి తోడు రహదారి పై మట్టి లోడుతో టిప్పర్ వాహనాలు, ట్రాక్టర్లు, నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు అందించడం కోసం భారీ వాహనాలు తిరుగుతుండడంతో రహదారి పూర్తిగా పాడయింది.ఇప్పటికే ఈ ప్రధాన రహదారి పై అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు.దీంతో వాహనదారులు ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులు పూర్తి స్థాయిలో డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్న గాని పాలకులు అధికారులు పట్టించుకోరా అని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి: బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు

అల్వాల్ ఎక్స్ రోడ్ నుండి డొక్కలబాయి తండా వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా తయారయిందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య తెలిపారు. వాహనాలతో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story