తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మంగళవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేటితో పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఉమ్మడి ఏపీలో కీలక బాధ్యతలు..

1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజుకు పరిపాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పలు కీలక పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. విజయవాడ సబ్ కలెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, హైదరాబాద్ నగరపాలక సంస్థ (GHMC) అదనపు కమిషనర్, కమిషనర్‌గా సేవలు అందించారు. అలాగే పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా కూడా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి..

ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం, 2014 నుంచి సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. కేంద్రంలో వివిధ కీలక శాఖల్లో తన మార్క్ చూపించిన ఆయన, తాజాగా తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తిరిగి రాష్ట్ర సర్వీసులోకి వచ్చారు. సీఎస్ బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన ఈ పదవిలో ఉండనుండటంతో రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు, వేగం పుంజుకునే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు ఐఏఎస్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story