- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి నిధుల కేటాయింపులో ప్రతిపక్ష కౌన్సిలర్లకు వివక్ష..?
ములుగు మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల విషయంలో ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులకు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల విషయంలో ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులకు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఓటు వేయకుండా ప్రతిపక్ష కౌన్సిలర్లను ఎన్నుకున్న వార్డుల్లో అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సైతం ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా లేమని బహిరంగంగానే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. జీవంతరావుపల్లి, బండారుపల్లి, ములుగు గ్రామ పంచాయతీలను కలిపి నూతనంగా ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.45 కోట్లను కేటాయించగా, ఇటీవల మరో రూ.15 కోట్లతో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, సెంట్రల్ లైటింగ్, కల్వర్టులపై స్లాబుల నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్‌కు ఐదుగురు, బీజేపీకి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. అలాగే అధికార పార్టీకి చెందిన నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక కావడంతో మున్సిపల్ పాలనలో అధికార పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ముందుగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల వార్డుల్లోనే అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొంటూ ఇటీవల మంత్రి సీతక్క చేతుల మీదుగా మూడు చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. అయితే ప్రతిపక్ష కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ వార్డులో కేవలం శిలాఫలకం ఏర్పాటు చేసి వదిలివేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ప్రతిపక్ష కౌన్సిలర్లు పలుమార్లు అధికారులను, అధికార పార్టీ నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని పేర్కొంటున్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత నిధులు మిగిలితేనే ప్రతిపక్ష వార్డుల్లో పనులు చేపడతామని నాయకులు బహిరంగంగా చెబుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, 2006లో నిర్మించిన రహదారులు పూర్తిగా దెబ్బతినడం వల్ల ప్రజలకు నిత్యం సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లను సమానంగా పరిగణించి అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






