"కోవా బన్" వివాదం.. మీడియాను ఏకి పారేస్తున్న జనం

by Muthe.Rajitha |

కోవా బన్ వివాదంలో చిరువ్యాపారిని టార్గెట్ చేయడంపై మీడియాపై మండిపడుతున్నారు సామాన్య ప్రజలు.

కోవా బన్ వివాదం.. మీడియాను ఏకి పారేస్తున్న జనం
X

దిశ, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో సందర్భంగా చెలరేగిన "కోవా బన్" వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక రోడ్డుపక్కన చిన్న వ్యాపారిని బెదిరించడం ఏమిటని సామాన్య జనం.. వివాదానికి కారణం అయిన మీడియాను ఏకి పారేస్తున్నారు. పొట్టకూటి కోసం కోవా బన్ అమ్ముకునే వ్యక్తిని టార్గెట్ చేయడంపై ఆ రిపోర్టర్స్ ను ప్రజలు చీదరించుకుంటున్నారు. "కోవా బన్" అనేది 10 రూపాయలకు దొరికే ఒక చిన్న బన్. దీని మధ్యలో పాలకోవా పెట్టి అమ్మే ఈ చిరుతిండి చుట్టూ మొదలైన చర్చ క్రమంగా సోషల్ మీడియా, ప్రధాన వార్తా ఛానళ్ల ప్రసార కావడంతో పెద్ద వివాదంగా మారింది.

అయితే ఈ మొత్తం ఘటనలో ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే.. సామాన్య ప్రజలు అంతా ఏకమై బాధితునివైపు నిలబడటం. కొంతమంది న్యూస్ ఛానెల్స్ పేరుతో చిన్న విషయాలను పెద్ద వివాదాలుగా చూపించి సమాజంలో అనవసర గొడవలు రేపుతున్నారని మండిపడుతున్నారు జనం. అంతేకాదు.. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి పెద్ద సమస్యలు పక్కనపెట్టి ఇటువంటి విషయాలను ప్రధాన వార్తలుగా చూపించడం సరైందా అని నిలదీస్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్, మాల్స్ వద్దకు వెళ్లి వారిని ఇదే విధంగా నిలదీయగలరా అని ప్రశ్నిస్తున్నారు.

అసలు ఏమిటీ "కోవా బన్" వివాదం..

ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర సమయంలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు చెందిన షేక్ షావలి అనే చిరు వ్యాపారి వ్యక్తి సైకిల్‌పై కోవా బన్ అమ్ముతున్నాడు. కొందరు యూట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అతని దగ్గరకు వెళ్లి వీడియోలు తీస్తూ, చుట్టుముట్టారు. "ఎక్స్‌పైరీ డేట్ లేదు, కల్తీ కోవా వాడుతున్నాడు, హైజీన్ లేదు, ఇది ఫుడ్ జిహాద్" అని ఆరోపణలు చేస్తూ.. అతన్ని భయబ్రాంతులకు గురి చేశారు. షేక్ షావలిని కెమెరా ముందు నిలబెట్టి బన్ తినమని ఒత్తిడి చేశారు. అతను భయంతో, అసహాయుడై, బాధను దిగమింగుకుంటూ.. తాము ఎవరినీ ఏమీ చేయడం లేదని, కోవా బన్నులు అమ్మి పొట్టపోసుకుంటామని మాట్లాడాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట కొంతమంది మతపరమైన కోణంలో ఈ విషయాన్ని ప్రచారం చేయాలని చూసారు.

తిప్పికొట్టిన సామాన్యులు

కానీ ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. సోషల్ మీడియాలో లక్షల మంది ఆ వ్యాపారికి మద్దతు ఇచ్చారు. "పొట్టకూటి కోసం బతికే వ్యక్తిని ఇలా అవమానించడం సరైంది కాదు" అని మండిపడ్డారు. "ఫుడ్ సేఫ్టీ సమస్య ఉంటే సంబంధిత అధికారులకు చెప్పాలి, యూట్యూబ్‌లో డ్రామా చేయడం ఎందుకు?" అని సదరు యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. " ఇది జర్నలిజం కాదు, బుల్లీయింగ్" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వార్తను ప్రసారం చేసిన రిపోర్టర్స్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీడియా బాధ్యతపై చర్చ

ఈ సంఘటనలో మీడియా పాత్రపై కూడా చర్చ జరిగింది. వార్తలు ప్రసారం చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, సెన్సేషన్ కోసం చిన్న విషయాలను పెద్దవి చేయొద్దని, ముఖ్యంగా రోడ్డుపక్కన వ్యాపారం చేసుకొనే చిన్న వ్యాపారులపై విద్వేషం పనికిరాదని మీడియారంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనను ఫుడ్ జిహాద్ అనే వాళ్ళు ఉన్నప్పటికీ.. లక్షలాది మంది మాత్రం ఆ చిరువ్యాపారి షావలికి మద్దతు పలికి.. మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ.. కోవా బన్ వ్యాపారిని టార్గెట్ చేయడం సరికాదని మండిపడుతూ.. షేక్ షావలికి లక్షల మంది మద్దతు పలకడం పట్ల ఇంకా మానవత్వం బతికే ఉందని ప్రజలు నిరూపించారని కొనియాడారు.

Next Story