నరవణే పుస్తకం పీడీఎఫ్ కాపీలు అక్రమం.. చట్టపరమైన చర్యలు తప్పవని 'పెంగ్విన్' హెచ్చరికలు

by Malleboina Mahesh |

"జనరల్ ఎంఎం నరవాణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ఇంకా ప్రచురించబడలేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు మరియు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ తరువాత, 'లీక్ అయిన' కంటెంట్‌ను ఉపయోగించినందుకు ఎల్ఓపీ హక్కుల ఉల్లంఘనను ఎదుర్కోవలసి రావచ్చు.

నరవణే పుస్తకం పీడీఎఫ్ కాపీలు అక్రమం.. చట్టపరమైన చర్యలు తప్పవని పెంగ్విన్ హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ జనరల్ అధికారి ఎం.ఎం. నరవణే (M.M. Naravane) రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పుస్తకంలోని పలు అంశాలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) సభలో చెప్పేందుకు ప్రయత్నించడంతో అసలు వివాదం నెలకొంది. దీంతో అసలు అధికారికంగా ముద్రణ కానీ ఈ పుస్తకం బయటకు ఎలా వచ్చిందనే కోణంలో విచారించేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో నరవణే పుస్తకం పీడీఎఫ్ కాపీలు (PDF copies of Naravane's book) బయటకు రావడంపై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (Penguin Random House India) స్పందించింది. ప్రచురణ హక్కులు తమకే ఉన్నాయని, అయితే ఈ పుస్తకం ఇంకా ముద్రణ దశకు చేరుకోలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. ఈ పుస్తకానికి సంబంధించి ప్రింట్, డిజిటల్ రూపంలో ఎలాంటి కాపీలను తాము ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, విక్రయించలేదని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో చలామణి అవుతున్న ఏ రకమైన కాపీలైనా తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘించడమేనని (Infringement of copyright rights) తేల్చి చెప్పింది.

ఈ పుస్తకానికి సంబంధించి పీడీఎఫ్, మరే ఇతర ఫార్మాట్‌లో ఉన్న సమాచారాన్ని వెంటనే తొలగించాలని, అక్రమంగా ప్రసారం చేయడం ఆపాలని ప్రచురణ సంస్థ హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా పుస్తక కంటెంట్‌ను లీక్ చేసినా, పంపిణీ చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ సంస్థ వైఖరిని స్పష్టం చేయడానికే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు పెంగ్విన్ రాండమ్ హౌస్ తెలిపింది. కాగా, గత వారం లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ పుస్తకం యొక్క "ప్రీ-ప్రింట్" కాపీని ఉటంకిస్తూ మాట్లాడటం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.

మరోవైపు, ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పోలీసులు (Delhi Police) సీరియస్‌గా తీసుకున్నారు. సోషల్ మీడియా, న్యూస్ ఫోరమ్‌లలో ఈ పుస్తక కాపీలు చలామణి అవుతున్నాయన్న సమాచారంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ (Special Cell) కేసు నమోదు చేసింది. ఇంకా అధికారికంగా ఆమోదం పొందని ఈ పుస్తకంలోని అంశాలు ఎలా లీక్ అయ్యాయి? ఈ ఉల్లంఘనకు బాధ్యులెవరు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ లీకేజీ వెనుక అసలు వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

ఇరకాటంలో రాహుల్ గాంధీ..?

పెంగ్విన్ ప్రచురణ సంస్థ తన ప్రకటనలో 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ('Four Stars of Destiny') పుస్తకం ఇంకా ముద్రణకే వెళ్లలేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాపీలన్నీ అక్రమమైనవని స్పష్టం చేయడంతో రాహుల్ గాంధీ చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. సభలో అధికారికంగా ఆమోదం పొందని, పైగా 'లీక్' అయిన సమాచారాన్ని (Unapproved and Leaked content) ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఉటంకించడం సభా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికార పక్షం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో, సభను తప్పుదోవ పట్టించారని, కాపీరైట్ ఉల్లంఘనకు గురైన అక్రమ పత్రాలను సభలో ప్రదర్శించారనే కారణంతో బీజేపీ ఎంపీలు ఆయనపై 'ప్రివిలేజ్ మోషన్' (సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం) నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. కాగా ఈ వ్యవహారం ఎంత వరకు దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story