తెలంగాణలో 'ఈ-వేస్ట్' కలెక్షన్ సెంటర్లు.. పీసీబీ సంచలన యాక్షన్ ప్లాన్

by Malleboina Mahesh |

తెలంగాణలో ఈ-వేస్ట్ నిర్మూలనకు పీసీబీ 26 రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ మొబైల్ స్టోర్లలో డ్రాప్ బాక్సులు పెట్టారు.

తెలంగాణలో ఈ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లు.. పీసీబీ సంచలన యాక్షన్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర పర్యావరణ, అటవీ, క్లైమేట్ చేంజ్ శాఖ జారీచేసిన ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2022 ప్రకారం ఈ-వేస్ట్ కలెక్షన్, రీసైక్లింగ్‌పై తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఏడాదికి 4,41,180 టన్నుల సామర్థ్యంతో కూడిన 26 ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో 16,930 టన్నుల సామర్థ్యం కూడిన నాలుగు సెంటర్లను పునరుద్ధరించింది.

రెండేండ్లలో 1.97 లక్షల మెట్రిక్ టన్నులు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1.97 లక్షల మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్‌ను సేకరించారు. 2023-24లో 65,777.277 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్‌ను రీసైక్లర్స్ సేకరించారు. దీనిలో 24,778.18 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్‌ను ప్రాసెస్ చేశారు. దీంతో 40,998.98 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్, గ్లాస్, ఫోమ్ వ్యర్థాలను వేరు చేశారు. దీంతోపాటు 2024-25లో 1,31,913.90 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్‌ను సేకరించారు. దీనిలో 59,288.90 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్‌ను ప్రాసెస్ చేశారు. దీంతోపాటు 72,624.96 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్, గ్లాస్, ఫోమ్ వంటి వ్యర్థాలను సపరేట్ చేశారు. రీసైక్లర్స్ సేకరించిన ఈ-వేస్ట్‌లో సగానికి సగం ఇతర వ్యర్థాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఆధ్వర్యంలో..

క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో ఈ-వేస్ట్ సేకరణకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ సెంటర్లలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బిగ్ సీ, బీన్యూ, హ్యాప్పీ, లాట్, సంగీత, సెలెక్ట్, టచ్ వంటి రిటైల్ స్టోర్లలో 30 డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా సమీప డ్రాప్ పాయింట్ల వివరాలు తెలుసుకుని, తమ వద్ద ఉన్న అవసరం లేని ఈ-వేస్ట్ ను అక్కడ జమ చేయాలని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలో సైతం ఈ-వేస్ట్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీఎంసీ పరిధిలోని ఐటీ కంపెనీల్లో ఈ-వేస్ట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగానే క్యూర్ పరిధిలో ఈ-వేస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.

ఎన్జీసీ ఆధ్వర్యంలో..

ఈ-వేస్ట్‌తో సంభవించే ప్రభావాలను ప్రజలకు వివరించడానికి తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ (టీజీఎన్జీసీ) ద్వారా పీసీబీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పర్యావరణంపై నా, ప్రజల ఆరోగ్యంపైనా ఈ-వేస్ట్ పరిణామాలను వివరిస్తూ 35 హ్యాకథాన్లను నిర్వహించారు. అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు స్కూల్స్, కాలేజీలు, ఇంజినీరింగ్ విద్యా సంస్థలు, ఐటీ కంపెనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు సేకరించడానికి కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Next Story