- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు పవన్ కల్యాణ్
తన నియోజకవర్గం ప్రజలని కలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: తన నియోజకవర్గం ప్రజలని కలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన ప్రజల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
ఆర్.ఆర్.బీ.హెచ్.ఆర్. కళాశాల మైదానం నుంచి పవన్ కల్యాణ్ వెలుపలికి రాగానే పలువురు ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు నిల్చుని ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు వాహనం నుంచి దిగిన పవన్ కల్యాణ్ అక్కడి నుంచి కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయం వరకు ప్రజల్ని పలుకరిస్తూ కాలినడకన ముందుకు సాగారు. పెద్దింటి అనంత పద్మావతి అనే మహిళ తమకు ఇంటి స్థలం కావాలని కోరారు. మరో మహిళ తమ ఇళ్ల వద్ద విద్యుత్ తీగలు సాగిపోయి కిందికి వచ్చేసి ప్రమాదకరంగా ఉన్నాయని, సాగిపోయిన విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులను ఆదేశించారు.
పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిశీలన
అనంతరం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్లో ఉన్న గదులను చూసి పిఠాపురంలో శాంతి భద్రతల తీరుపై ఆరా తీశారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఫొటోలు దిగారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి కుక్కుటేశ్వరస్వామి ఆలయ సమీపంలో యానాదుల కాలనీవాసులను పలుకరించారు. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి యానాదుల కాలనీలో పక్కా ఇళ్లు నిర్మించాలని, డ్రయినేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకున్నారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయం వెలుపల ఉన్న దుకాణదారులను పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చివరిగా ఆలయ అర్చకులతో మాట్లాడి వారితో ఫొటోలు దిగారు.
పిఠాపురంలో రూ.211 కోట్ల విలువైన పనులు
పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతితోపాటు అభివృద్ధి పండుగను తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పాల్గొన్న ఆయన రూ.211 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురం మండల పరిధిలో రూ.9.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, కోనపాపపేటలో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్, ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బీ నిధులు, సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, గోకులాలు, వివిధ అభివృద్ధి పనులు ఉన్నాయి.






