TG లో తెలంగాణ నినాదం, భావోద్వేగం ఉంది.. ఏపీలో కులాల కొట్లాటలున్నాయి : పవన్ కళ్యాణ్

by Muthe.Rajitha |

ఏపీ రాజకీయాల్లో, సామాజిక సమీకరణాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.

TG లో తెలంగాణ నినాదం, భావోద్వేగం ఉంది.. ఏపీలో కులాల కొట్లాటలున్నాయి : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాల్లో, సామాజిక సమీకరణాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచనా విధానాలు, ప్రాంతీయ ఉనికి, కుల రాజకీయాలపై తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకున్నారు. తెలంగాణ సమాజంలో ఆ రాష్ట్ర ప్రజలకు తమ ప్రాంతం పట్ల ఒక బలమైన నినాదం, ఉనికి, భావోద్వేగభరితమైన కనెక్టివిటీ ఉన్నాయని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అయితే, దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు 'ఆంధ్రా' అనే ఒక ప్రాంతీయ ఉనికి కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఉనికి స్థానంలో కేవలం కులాల కొట్లాటలు, కుల రాజకీయాలే ఎక్కువగా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో ఈ కుల దూషణల సంస్కృతి పరాకాష్టకు చేరిందని, కొందరు సోషల్ మీడియా వేదికగా కులాల పేరుతో అసభ్యకరమైన దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. దీనికి ముగింపు పలకడానికే జనసేన తరఫున 'సేనాగళం' అనే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుడిని కూడా ఏపీలో ఏదో ఒక కులానికి పరిమితం చేసి, ఆయనకు కులం రంగు అంటగట్టడం అత్యంత దారుణమని ఆవేదన చెందారు.

Next Story