ఆ వీణలు నన్నెంతో ఆకట్టుకున్నాయి: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |

సంక్రాంతి పండుగ సందర్భంగా పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

ఆ వీణలు నన్నెంతో ఆకట్టుకున్నాయి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

ప్రేక్షకులను ఎంతో అలరించారు

మొదటి రోజు సత్యసాయి జిల్లాకు చెందిన ఉరుములు కళారూపాన్ని ముందుండి నడిపించిన ఎస్. వరప్రసాద్, కర్నూలు జిల్లా నుంచి గురవయ్యలు కళారూపంతో సంప్రదాయ వైభవాన్ని చాటిన జె. మల్లికార్జున, అదే జిల్లాకు చెందిన లంబాడీ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జి. సునీత, కృష్ణా జిల్లా సంప్రదాయమైన డప్పులు కళారూపాన్ని ఘనంగా ప్రదర్శించిన వి. రాజీవ్ బాబు ప్రేక్షకులను ఎంతో అలరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తప్పెటగుళ్లు కళారూపంతో జానపద వైభవాన్ని ప్రతిబింబించిన కె. మల్లేశ్వర రావు, విజయనగరం జిల్లా సంప్రదాయ పులి వేషాలతో సంబరాన్ని రెట్టింపు చేసిన కె.అప్పారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ ప్రాంతానికి చెందిన థింసా నృత్యంతో ఆదివాసీ సంస్కృతిని ఆవిష్కరించిన పొద్దు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణా–గోదావరి ప్రాంతానికి చెందిన కోలాటం కళారూపంతో మహిళా శక్తిని చాటిన అంజలి, కోనసీమ సంప్రదాయ గరగలు కళారూపంతో సంప్రదాయాన్ని నిలిపిన రాజ్‌కుమార్, హరిదాసులు–గంగిరెద్దు కళారూపంతో భక్తి రసాన్ని నింపిన శ్రీ సతీష్ గారు ప్రదర్శనలు తొలి రోజుని మరింత స్మరణీయంగా మార్చాయి.

రెండవ రోజు ప్రార్థనా గీతాలతో శుభారంభం చేసిన విజయ శంకర్ నాయకత్వంలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల, రాజమహేంద్రవరం బృందానికి, కూచిపూడి రామాయణ ఘట్టాల ప్రదర్శనతో భక్తి భావాన్ని నింపిన వీ.ఎస్. ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల, రాజమహేంద్రవరం విద్యార్థులకు, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనను ఆవిష్కరించిన ప్రవీణ శ్రుతి లయ – పిఠాపురం వారి కూచిపూడి (ఆల్ ఇండియా డాన్స్ ఫార్మ్స్) ప్రదర్శనకు, యోగా డ్యాన్స్ ద్వారా ఆరోగ్యం–ఆధ్యాత్మిక సమన్వయాన్ని చాటిన శ్యామ్ బాబు బృందానికి అభినందనలు.

మూడవ రోజు వినాయక తత్వాన్ని ప్రతిబింబించిన కూచిపూడి నృత్యప్రదర్శనతో అలరించిన మంజీర కూచిపూడి – దుర్గారావు బృందానికి, నటరాజ నృత్య రూపంతో ఆంధ్ర నాట్య వైభవాన్ని చాటిన పి. సత్యనారాయణకి, రేలారే రేలా జానపద గీతాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన జానకీరావు ఆర్కెస్ట్రా బృందానికి అభినందనలు. ఈ మహోత్సవంలో పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన ప్రతి సంప్రదాయ కళాబృందంలోని కళాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

హైపర్ ఆదికి, నవీన్ పొలిశెట్టికి థాంక్స్

సంబరాల్లో భాగంగా మొదటి రోజు పిఠాపురం పట్టణంలో ప్రధాన వీధులు, రెండో రోజు గొల్లప్రోలు మండలం, మూడో రోజు యూ.కొత్తపల్లి మండలాల్లో తిరుగుతూ ప్రజలందరినీ అలరించేందుకు మీరు చేసిన కృషి మరువలేనిది. ప్రత్యక్షంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన తోలు బొమ్మల కళాకారులు, మగ్గాలతో సహా వచ్చిన నేతన్నలు, ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులు, బొబ్బిలి వీణల తయారీదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. స్టాల్ వద్దే వీణలు తయారు చేసిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అని పిలవగానే కదిలి వచ్చిన నటులు హైపర్ ఆదికి, ఆర్. కె. సాగర్‌కు, హీరో నవీన్ పొలిశెట్టికి, ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్‌కి, జబర్దస్త్ నటులు నెల్లూరు నాగరాజుకి, శ్రీనివాసులు నాయుడుకి, బుల్లితెర నటులు అభిరాం తదితరులకు నా హృదయపూర్వక ధన్వవాదాలు. ఈ వేడుకకు పూర్తి స్థాయిలో సహకరించిన జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్‌కి, జిల్లా యంత్రాంగానికి, భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్‌కి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు నుంచి కానిస్టేబుల్స్, హోమ్ గార్డులు వరకూ అందరికీ కృతజ్ఞతలు. పిఠాపురంతోపాటు కాకినాడ జిల్లా పరిధిలోని జనసేన, కూటమి పార్టీల నాయకులు, శ్రేణులకు, కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన నా నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సంక్రాంతి ఇచ్చిన ఉత్సాహం పిఠాపురం ప్రజల్లో ఏడాది మొత్తం కొనసాగాలి. నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి. అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story