భూ భారతి కింద పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి

by Ratna Kumari |

భూ భారతి కార్యక్రమంలో భాగంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి, కాస్తు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు.

భూ భారతి కింద పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి
X

దిశ, ఏన్కూరు : భూ భారతి కార్యక్రమంలో భాగంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి, కాస్తు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఏన్కూరు మండలం తిమ్మారావుపేట సెంటర్‌లో సీపీఎం పతాకాన్ని కాట్రాల బిక్షం ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి దొంతిబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో బొంతు రాంబాబు మాట్లాడారు. ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ భూ సమస్యలకు సరైన పరిష్కారం లభించడం లేదని ఆయన అన్నారు. సమగ్ర భూ సర్వే నిర్వహించి, సాగు ఆధారంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.9 వేల కోట్ల సవరించిన అంచనాలు సిద్ధం చేసినప్పటికీ, బడ్జెట్‌లో కేవలం రూ.336 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ జూలై 1 నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల రైతులకు మద్దతు ధర కూడా అందడం లేదని విమర్శించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, వ్యవసాయ రంగ రక్షణ కోసం గ్రామీణ ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాణోత్ బాలాజీ, సీపీఎం మండల కార్యదర్శులు కుందనపల్లి నరేంద్ర, అంబటి శ్రీనివాస్ రెడ్డి, బాణాల శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి కలసాని సాయి, సీఐటీయూ జిల్లా నాయకులు వెల్పుల రాములు, రైతు సంఘం నాయకులు గుండా సత్యనారాయణ రెడ్డి, ఎస్‌కే జానీ, రేగల తిరుమలరావు, మన్నేపల్లి పద్మ, లక్ష్మి, వెంకట్రావమ్మ, మాజీ సర్పంచులు కొడేం బిక్షం, బండ్ల చిన్న జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story