- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఓటరు జూలై 24లోగా తమ వివరాలను నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు.

దిశ ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఓటరు జూలై 24లోగా తమ వివరాలను నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని 29వ వార్డులో జరుగుతున్న ఎస్.ఐ.ఆర్. ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కాలంలో ఓటర్ల వివరాల సేకరణ, సవరణ, అనుసంధాన ప్రక్రియను విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ప్రజలు ఫారాలను పూర్తిగా పూరించి, 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, నానమ్మ తదితర కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం సంతకం చేసి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జతచేసి సంబంధిత బీఎల్‌ఓకు అందజేయాలని తెలిపారు. ఒక ప్రతిని బీఎల్‌ఓ వద్ద ఉంచుకుని, మరో ప్రతిని ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఓటర్లు తమ వివరాలను బీఎల్‌ఓలను సంప్రదించడం ద్వారా లేదా voters.eci.gov.in వెబ్‌సైట్‌లో "Search by Electoral" ఎంపిక ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతి ఓటరి ఓటు భద్రంగా ఉంటుందని, ఫారాలు సమర్పించని వారి వివరాలు మాత్రమే తదుపరి పరిశీలనకు లోబడే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొంటూ, జిల్లాలోని ప్రతి అర్హ ఓటరు జూలై 24లోగా తమ వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీఎల్‌ఓ సమక్షంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్వయంగా తన ఓటు వివరాలను పరిశీలించారు. రీప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న వివరాలను నమోదు చేసి, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జతచేసి బీఎల్‌ఓకు అందజేశారు. ఈ సందర్భంగా జూలై 24 వరకు కొనసాగనున్న ప్రత్యేక ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొని ఫారాలను సమర్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ తహసీల్దార్ రాజు, వార్డు సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






