- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలకలగూడలో జ్యోతి మెడికల్ హాల్‌లో దోపిడీ
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావునగర్‌లో ఉన్న జ్యోతి మెడికల్ హాల్ కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన దోపిడీ స్థానికంగా కలకలం రేపింది.

దిశ, సీతాఫలమండి : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావునగర్‌లో ఉన్న జ్యోతి మెడికల్ హాల్ కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన దోపిడీ స్థానికంగా కలకలం రేపింది. ముసుగులు ధరించిన గుర్తుతెలియని ఎనిమిది మంది దుండగులు కార్యాలయంలోకి చొరబడి, కత్తులతో బెదిరించి రూ.30 వేలకుపైగా నగదును దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 27 రాత్రి వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం జ్యోతి మెడికల్ హాల్ సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. కాగా, జూన్ 28 తెల్లవారుజామున సుమారు 3:18 గంటల సమయంలో ఎనిమిది మంది దుండగులు ముసుగులు ధరించి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కత్తులతో బెదిరించి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం గ్యాస్ సిలిండర్‌తో పాటు ఇతర పనిముట్ల సహాయంతో కార్యాలయ గదుల తలుపులను బలవంతంగా తెరిచిన దుండగులు నాలుగో అంతస్తులో ఉన్న క్యాష్ కౌంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ ఉన్న రూ.27,500 నగదును అపహరించారు. అంతేకాకుండా, ఒక సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న రూ.1,500, మరో గార్డు వద్ద ఉన్న రూ.1,000 నగదును కూడా దోచుకెళ్లారు. మొత్తం రూ.30 వేలకుపైగా నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దోపిడీ అనంతరం సెక్యూరిటీ గార్డుల మొబైల్ ఫోన్లను అక్కడే పడవేసిన దుండగులు, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భయాందోళనలకు గురైన సెక్యూరిటీ సిబ్బంది అనంతరం యాజమాన్యానికి సమాచారం అందించారు.
జ్యోతి మెడికల్ హాల్ యజమాని సతీష్ కుమార్, ఆయన కుమారుడు కలిసి మందులను రిటైల్ మెడికల్ షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. సంఘటన విషయం తెలుసుకున్న సతీష్ కుమార్ వెంటనే కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీ నరసయ్య, చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మధుబాబు తదితర ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరును సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. డీసీపీ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దోపిడీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పద్మారావునగర్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.






