- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC పూర్తి చేస్తా... నల్లగొండ పొలాలకు కృష్ణా నీటిని పారిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కృష్ణానది నీటిని నల్లగొండ నేల మీద పారిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కృష్ణానది నీటిని నల్లగొండ నేల మీద పారిస్తానని, పంటలు పండించడమే కాకుండా డిండి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంపూర్ణంగా సహకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన జీవిత లక్ష్యం ఒకటేనని... అది మూసీ నదీ ప్రక్షాళన అని అన్నారు. మోదీ సబర్మతీ, దిల్లీ యమునా కాదు... ఈ దేశానికి ఎవరు వచ్చినా ప్రక్షాళన తర్వాత మూసీని చూసేందుకే రావాలని అన్నారు. మూసీ కంపు నుంచి కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. వట్టేసి చెప్తున్నా మూసీ పూర్తి చేస్తా... ఎవరొచ్చినా, ఎవరు అడ్డం పడినా, ఇంకెవరు ఆత్మహత్య చేసుకున్నా మూసీలో వేసి తొక్కుతానని హెచ్చరించారు. మూసీ నదీ ప్రక్షాళన చేస్తానని పేర్కొన్నారు. రాసుకోండి... 1994 నుంచి 2004 రెండుసార్లు టీడీపీ, 2004 నుంచి 2014 రెండుసార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు రెండుసార్లు బీఆర్ఎస్... 2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో మూడు రంగుల జెండా ఎగురుతుందని... తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుందన్నారు. ఇదే తన మాట అని ప్రజలకు తనకు అండగా నిలబడాలని... రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 13వేల కోట్లతో చేపట్టిన 6300 కి.మీ. హ్యామ్ రోడ్ల పనులకు ఆదివారం నల్లగొండలో శంఖుస్థాపన చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రజా సభలో సీఎం ప్రసంగించారు.
ఎలక్షన్ చేయటం, కలెక్షన్ చేసుకోవడమేనా వారి త్యాగం...
తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ అంశం తెలుసు... తొలి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం సాధిస్తేనే మంత్రి పదవిని తీసుకుంటామని పేర్కొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ లాగే... నల్లగొండ నుంచి ఆమరణ నిరహారదీక్ష చేసి ఆరోగ్యం పాడుచేసుకుని... తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవిని చేపట్టారని సీఎం అన్నారు. బీఆర్ఎస్ నాయకులు త్యాగాలు చేశామని చెప్పుకుంటారని... కానీ త్యాగం అంటే ఎలక్షన్ చేయటం, కలెక్షన్ చేసుకోవడమేనా వారి త్యాగం అని ప్రశ్నించారు. వారిది త్యాగం అయితే తన మంత్రి పదవికి రాజీనామా చేసి చనిపోయేంత వరకు మంత్రి పదవినే చేపట్టని కొండా లక్షణ్ బాపూజీ త్యాగాన్ని ఏమనాలో చెప్పాలన్నారు. ఎలక్షన్, కలెక్షన్, సెలెక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి త్యాగాన్ని ఏమనాలన్నారు. 100 రూ. పెట్టి పెట్రోలు తెచ్చుకున్న మీరు... 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోని అగ్గిపెట్టె రావుదే త్యాగం అయితే తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలని ప్రశ్నించారు. కానిస్టేబుల్ కిష్టయ్య నేలకొరిగిన త్యాగాన్ని, యాదయ్య, ఈషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు పదేళ్లు ఆర్థిక, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాడని... రూ.69వేల కోట్ల అప్పులో ఉన్న తెలంగాను రూ.8.11లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా పదేళ్లలో వందేళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఈ తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని భరించాలా... మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని అన్నారు.
తోడేళ్ల మాదిరిగా తిరుగుతున్నారు...
బావ, బామ్మర్దులు ఇద్దరూ తెలంగాణ మీద తోడేళ్ల మాదిరిగా పడి తిరుగుతున్నారని... తమ ప్రభుత్వం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వారు చెబుతున్నారని... కానీ ప్రజలెవరూ కోరుకోవడం లేదని... వారి కుటుంబం, వారి దోపిడీకి అండగా నిలబడిన వారు మాత్రమే కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాపాలన ప్రజలంతా సంక్షేమ పథకాలను పొందుతుంటే అసూయ పడుతున్న వాళ్లు వారిని కోరుకుంటున్నారేమో కానీ తెలంగాణ సమాజం వారి కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేశారని అన్నారు. భవిష్యత్తులో వారికి పదవి అనేదే ఉండదన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే వారి గతం గురించే కానీ భవిష్యత్తు అనేదే ఉండబోదన్నారు. బీఆర్ఎస్ ను ఉప్పపాతర వేసినం... మళ్లీ మొక్క కూడా మొలవనీయమని నల్లగొండ జిల్లా ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. తాము చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల బావబామ్మర్దులు బిల్లారంగాలు ఊరూరు తిరిగి అబద్దాలు చెప్తున్నారని అన్నారు. నిజం మాట్లాడితే వేయి ముక్కలై చస్తారని దేవుడు వారికి శాపం పెట్టిండన్నారు. ఒక్క మాట కూడా నిజం మాట్లాడరని... మొత్తం కుటుంబం అంతా అంతేనని ఎద్దేవా చేశారు. ఫాంహౌస్ లో పడుకున్న శుక్రాచారుడు, ఊర్ల మీద తిరిగే మారీచుడు, సుభావుడు వీరంతా ఒకటే తీరన్నారు. "నోరు తెరిస్తే అబద్దాలు చెప్తారు. ఒక్క అబద్దాన్ని వందసార్లు చెప్తే నమ్మకపోతారా అని అనుకుంటారు... ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలను ఎలా పొట్టన పెట్టుకున్నారో... అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టారో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో వారి జాతకమంతా తెలంగాణ సమాజానికి తెలుసు. ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని నాటకాలు వేసినా తెలంగాణ సమాజం నమ్మదు, క్షమించదు..." అని విమర్శించారు. మంత్రి లక్ష్మణ్ రూ.687 కోట్ల టెండర్లు పిలిస్తే రూ.3వేల కోట్ల అవినీతి జరిగిందన్నారని.... సింగరేణిలో టెండరే కాకున్నా... మొత్తం సింగరేణిని కొల్లగొట్టారని అబద్దాలు చెప్తున్నారని పేర్కొన్నారు. "తులసీ వనంలో గంజాయి మొక్కలాగా సూర్యాపేటలో ఒకడు జానడోడు మిగిలిండు... మా వెంకన్న మీద ఎగురుతుండు.... మళ్లీ మొలవకుండా చూసుకుంటామని సూర్యాపేట వాళ్లు చెప్పారని" సీఎం అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, పన్నెండేళ్ల మోదీ పాలన, ఇందిరమ్మ పాలనపై చర్చకు సిద్ధమా...
అధికారం కోల్పోయిన అక్కసుతో కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని... మూసీ కంటే వీరి కడుపులోనే విషం ఎక్కువగా ఉంది... రేవంత్ రెడ్డి ఏం తెచ్చాడని అడుగుతున్నారని... అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలన, పన్నెండేళ్ల బీజేపీ పాలన, రెండున్నరేళ్ల తమ పాలనపైన చర్చ చేద్దాం మీరు సిద్ధంగా ఉన్నారా... అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటు నుంచి... తెలంగాణ ఏర్పాటు కోసం చేసుకున్న బలిదానాల మీద దేనిమీదైనా చర్చకు సిద్ధంమని ఆయన సవాల్ విసిరారు. పేదవాడి గుర్తింపే రేషన్ కార్డు... పదేళ్లు రేషన్ కార్డే ఇవ్వలేదని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే దాన్ని బర్రెలకు దాణాగా వేసే పరిస్థితి ఉండేదని... ఇప్పుడు ఏడాదికి రూ.16వేల కోట్లతో 3.28కోట్ల పేదలకు ఆరు కిలోల చొప్పన సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ తింటున్న సన్నబియ్యమే పేదలంతా తింటున్నారని... అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూసుకోవచ్చని అన్నారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇచ్చామని... ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇచ్చామని... పేదలు పక్కా ఇళ్లు కట్టుకుంటుంటే వారి కడుపు అంతా మసిమసి అవుతోందన్నారు. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో కేసీఆర్, జన్వాడలో 100 ఎకరాల్లో కేటీఆర్, అల్లుడు మొయినాబాద్ లో 50 ఎకరాల్లో, శంకర్ పల్లిలో బిడ్డ 25 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకోవచ్చు వందల కోట్లు ఖర్చు చేసి ఫాంహౌస్ లు కట్టుకునే వారు పేదలకు ఇళ్లు ఇస్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్శించారు. ఏడాదికి 2 లక్షల ఇళ్లు కట్టినా పదేళ్లలో 20 లక్షల మందికి ఇళ్లు ఇచ్చేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ ఒక్కరోజైనా పేదోడికి ఇళ్లు ఇవ్వాలనే సోదీ లేకుండా పోయిందన్నారు. పేదోడికి ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనే వారికి రాలేదన్నారు. రైతుల కోసం తాము ఈ 30 నెలల్లో రూ. 1.56వేల కోట్లు ఖర్చుపెట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఎన్నిసార్లు తిప్పినా రాష్ట్రాభివృద్ధికై నిధుల కోసం వెళ్తున్నామన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా నానా తిప్పలు పడి 80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి ఈ ఏడాది రికార్డు సృష్టించామన్నారు. రెండేళ్లలో 2.88లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే రికార్డు స్థాయిలో నంబర్ వన్ చేరామన్నారు. లక్ష కోట్ల కోట్లతో కాళేశ్వరం కడితే మూడేండ్లలోనే కట్టుడు, కూలుడు, గోదావిరిలో కట్టుకుపోవడం అయ్యిందన్నారు. హరీష్ రావు కాళేశ్వరావు అని పిలుపించుకుని కూలిపోతే అటువైపే చూడటం లేదన్నారు. ప్రభుత్వ బడికి, హాస్పిటల్ పోవాలంటే భయపడే రోజులు పోయాయని తెలిపారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్ ఇచ్చి తెలంగాణ గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్ లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదోళ్ల పిల్లల కోసం ఆరుట్ల వంటి టీపీఎస్ లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 40 ఏళ్ల నుంచి రావణకాష్టంలా ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. వందేళ్లుగా లేని జనగణనలో కులగణనను చేశామన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచి కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చామన్నారు.
ప్రజాపాలన పోవాలంట... పాపాల భైరవుడు రావాలంట...
రాష్ట్రానికి 30నెలల్లో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన పోవాలంట... పాపాల భైరవుడు రావాంట... ఎందుకు రావాలి... ఉద్యోగాలిచ్చినందుకు తమ ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు, ఫీజు రీయంబర్స్ మెంట్, రైతు రుణమాఫీ, రైతుభరోసా, వంటి సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు తమ ప్రజాపాలన పోవాలనా అని నిలదీశారు. "దశాబ్దాలుగా ఫ్లోరైడ్ పీడిస్తుంటే కోమటిరెడ్డి, జానారెడ్డి వైఎస్ఆర్ ను ఒప్పించి ఎస్ఎల్బీసీ 34 కి.మీ పూర్తి చేసి 10 కి.మీ అప్పచెప్తే పదేళ్లు పడావు పెట్టిన దుర్మార్గుడు. నీవు పడావు పెట్టిన ఎస్ఎల్బీసీని మేం పూర్తిచేసి 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండకు తాగునీరు ఇస్తున్నందుకు తాము అధికారంలోకి పోవాల్నా" అని అన్నారు. "కడుపులో పుట్టబోయే బిడ్డ కన్ను వంకరో కాలు వంకరో పుడతారని అందుకే నిన్న మొన్ననే కొడుకు పెళ్లి చేసి హైదరాబాద్ పంపించినట్లు ఓ సోదరి తనకు చెప్పింది. మూసీ కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, మునుగోడు, నల్గొండ జిల్లా వారి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మూసీ ప్రక్షాళన చేస్తున్నందుకు నేను దిగిపోవాల్నా" అని ప్రశ్నించారు. తమ ఫోన్లు, అధికారుల ఫోన్లు విన్నారంటే రాజకీయం, అధికారం గురించి తెలుసుకునేందుకు విన్నాడనుకోవచ్చని... కానీ భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న వాళ్లను చెప్పుతో కొట్టినా తక్కువేనన్నారు. ఆ పాపాల భైరవుడు, పరీక్ష పేపర్లు అమ్ముకుని వేల కోట్ల సంపాదించుకునేటోడు, కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు, పేదలు రేషన్ కార్డులు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిన వాడు, పదేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తల ప్రాణాలు తీసినందుకా ఆ పాపాల భైరవుడు మళ్లీ రావాలా అని ప్రశ్నించారు. వారిలా తాము ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టలేదన్నారు. డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మండలి చైర్ పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






