- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. భారతీయ పర్యాటకుల స్టైలే వేరు
ఏ దేశం పోయినా.. ఎక్కడ తిరిగినా.. మనోళ్లదొక ప్రత్యేకత ఉంటుంది. వెళ్లిన దగ్గర ఊరికే ఉంటే దాంట్లో కిక్కేముంటుంది అనుకుంటారో ఏమో.. చిందరవందర చేసి చిల్లర వేషాలు వేస్తుంటారు కొందరు.
దిశ, ఫీచర్స్: ఏ దేశం పోయినా.. ఎక్కడ తిరిగినా.. మనోళ్లదొక ప్రత్యేకత ఉంటుంది. వెళ్లిన దగ్గర ఊరికే ఉంటే దాంట్లో కిక్కేముంటుంది అనుకుంటారో ఏమో.. చిందరవందర చేసి చిల్లర వేషాలు వేస్తుంటారు కొందరు. ఎగురుతారు, గెంతులేస్తారు, గేలి చేస్తుంటారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లామనే స్పృహ లేకుండా పరిహాసాలు చేస్తుంటారు. అడ్డమైన చేష్టలతో అల్లరి చేస్తుంటారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడిన మనమింతే. మన వ్యవహారం ఇంతే.
పర్యాటకంలోనూ పైత్యమా?
వెళ్లిన చోట వికృతం చేయడం మనవాళ్లకొక ఫ్యాషనైపోయింది. విచ్చలవిడి తనం బాగా అలవాటైపోయింది. అలాగని మన పర్యాటకులను తక్కువ చేయడం లేదు. అక్కడ కొందరు ఇక్కడ కొందరు పర్యాటక వాతావరణాన్ని పాడు చేస్తున్నారని చెప్తున్నాం. అంటే.. ఒక గుడికో లేదా పార్కుకో లేదా వేరే ఇంకేదైనా సందర్శన ప్రాంతానికో వెళ్లారనుకుందాం. అక్కడ ప్రశాంతంగా ఉంటారా మనవాళ్లు? తమ పైత్యాన్ని ప్రదర్శించి లేని సంభాషణను ముందేసుకుంటారు. అనవసర చర్చలు లేవనెత్తి లేని పంచాయితీ పెడతారు. దీంతో సానుకూల, సంతోషకరమైన వాతావరణం దెబ్బతిని పర్యాటకం కాస్త పసలేకుండా సాగుతుంది.
రూల్స్ మాట్లాడటం తెలివా?
నిజంగా భారతీయ పర్యాటకుల స్టయిలే వేరు. రూల్స్ గీల్స్ లెక్క చేయనంత తెగింపు ఉంటుంది. ఈ ధోరణి ఇటీవల మరీ ఎక్కువైంది. మందకు మందనే వెళతారు. వంద రూపాయలు అవుతుంది అనగానే ఇంతెత్తున లేచి ఎగురుతారు. అంత మందిని తీసుకొచ్చి వంద రూపాయలు కూడా చెల్లించకపోతే ఎలా అనే స్పృహ ఉండదు. అనవసరంగా చర్చ పెట్టి సమయం వృథా చేసుకోవడం తప్ప దానితో ఒరిగేదేమీ ఉండదు. వచ్చింది విహారానికి.. చేసేది వినోదం.. అనేది మర్చిపోయి చిన్న చిన్న విషయాలకు రూల్స్ మాట్లాడి పక్కవాళ్లకు విసుగెత్తిస్తారు. వెంట వచ్చినవాళ్లకు తలనొప్పి కలిగిస్తారు.
ఎన్విరాన్మెంట్ సెన్స్ ఎంత?
భారతీయ పర్యాటకుల్లో లోపించిన ఇంకో ముఖ్యమైన విషయం పర్యావరణ పరిరక్షణ. ఎన్విరాన్మెంట్ సెన్స్ ఎంత వెతికినా కనిపించదు మనవాళ్లలో. విచ్చల విడిగా ప్లాస్టిక్ వాడతారు. ఫుడ్ అంతా ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తారు. చిన్న పిల్లలుంటారు.. ముసలివాళ్లు ఉంటారు.. కవర్లను చెత్తబుట్టలో వేయాలనే ఆలోచనే రాదు మనవాళ్లకు. పార్క్ సిబ్బందో లేదా మున్సిపల్ సిబ్బందో చేసే పని అనుకుంటారు. ఎందుకులే అని ఎవరైనా తీసేస్తుంటే ‘ఏయ్.. బుద్ధిలేదా? అవన్నీ చేయడానికి మున్సిపల్ వాళ్లు లేరా?’ అని వారిస్తారు. చేసేవాళ్లను కూడా చెడగొట్టి అదో రకం ఆనందం పొందుతుంటారు.
పిచ్చి డ్యాన్స్‌కు ట్రెండింగ్ ట్యాగా?
టూరింగ్ అనగానే పిచ్చి డ్యాన్సులతో చిర్రెత్తించడం కొందరికి అలవాటైపోయింది. వాళ్ల ధ్యాస ఎంతసేపూ ఆట పాట మీదనే ఉంటుంది.. సరే ఫ్యామిలీతో బయటకొచ్చారు సరదాగా డ్యాన్సు చేశారు అనుకోవడానికి కూడా ఉండదు. మొత్తం ఏవో పిచ్చి పిచ్చిగా ఎగిరి దానికి ట్రెండింగ్ డ్యాన్స్ అని పేరు పెట్టి పబ్లిక్‌కు అసౌకర్యం కలిగిస్తుంటారు. డీజేలు పెట్టి డించక్ డించక్ డించక్ అంటూ ఎగురుతుంటారు. అవేం డ్యాన్సులో ఏమో ఒకొక్కరైతే పూనకాలు వచ్చినట్లే ఊగుతుంటారు. ఇదేం డ్యాన్స్ అని అడిగితే ‘ఇదే ఇప్పుడు క్రేజీ డ్యాన్స్’ అంటూ సమర్థించుకుంటారు. కానీ పక్కవాళ్ల సంతోషం గురించి ఆలోచించరు.
మన ప్రయారిటీ దేనికీ?
మనవాళ్లకు పట్టిన ఇంకో పిచ్చి సెల్ఫీ పిచ్చి. ఎక్కడ పోయినా.. ఏం చేసినా ఫస్ట్ సెల్ఫీ తీసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అది ఎంతలా అంటే మనం వెళ్లిన పనిని సైతం పక్కన పెట్టి ముందు సెల్ఫీలకే ప్రయారిటీ ఇవ్వడం. ఒకరి నుంచి ఒకరికి ఇదొక వైరస్‌లా మారింది. పెద్దవాళ్లను చూసి చిన్న పిల్లలు సైతం సెల్ఫీ మాయలో పడిపోతున్నారు. సందర్శనకు వచ్చిన ప్రదేశాలను వీక్షించడం మానేసి ఇలా ఒకరికొకరు పోటీ పడి సెల్ఫీ పిచ్చిలో సేద తీరుతున్నారు. ఇప్పుడెవరైనా వద్దని చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ‘సెల్ఫీ లేని టూర్ ఉంటుందా.. ఈ మాత్రం దానికి వచ్చి ఏం ప్రయోజనం’ అంటుంటారు.
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లేనా?
జనాలకు పట్టిన ఇంకో పిచ్చి రీల్స్ పిచ్చి. రీల్స్ లేకుండా నిద్ర లేవరు. రీల్స్ లేకుండా పడుకోరు. రీల్స్ లేకుండా తినరు.. బయటకు వెళ్లరు. అంత పవర్‌ఫుల్ వెపన్ అయిపోయింది మనవాళ్ల దృష్టిలో. ఇక యాత్రలకు.. విహారాలకు.. విందులకు వెళితే ఆగుతారా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు యాత్ర మొదలైనప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేదాక రీల్స్‌తో పేట్రేగిపోతుంటారు. ఎవరినీ పట్టించుకోకుండా.. ఎవరు చెప్పినా వినకుండా.. పిచ్చి రీల్స్‌తో పక్కవాళ్లపై పిడుగులు వేస్తుంటారు. ఆపండ్రా బాబూ అని ఎవరైనా అంటే ‘మీకు తీసుకునే చేతగాక మా వెంట పడతారేమీ’ అంటూ తిరగబడుతుంటారు.
హీరోయిజం చూపించాలా?
రీల్స్ మాయ ఎంత పీక్స్‌లో ఉందంటే కొందరు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనాలోచిత, అతి ధైర్యం వల్ల విహారాన్ని కాస్త విషాదంగా మారుస్తున్నారు. ప్రమాదకర ప్రదేశాల వద్దకు వద్దంటే వెళ్లడం.. డేంజర్ బోర్డులు పెట్టినా లెక్క చేయకపోవడం.. తోటివాళ్ల దృష్టిలో హీరోయిజం చూపించాలి అనుకోవడం.. తాము ఏదైనా సాధిస్తాం.. సాహసాలకు పెట్టింది పేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ధోరణి వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు వార్తల్లో ఎన్నో చూస్తుంటాం. ఎన్నో విషాధ గాథలను చూసి బాధపడుతుంటాం.
రీల్ కోసం ఎక్కడిదాకనో?
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శ్రీకాంత్ రామచంద్ర సాత్రే స్నేహితులతో కలిసి అబాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఏనుగుతో రీల్ చేసేందుకు దగ్గరకు వెళ్లాడు. గజరాజుకు కోపం వచ్చి శ్రీకాంత్‌ను తొక్కేసింది. పాపం ప్రాణం పోయింది. అల్లూరి జిల్లాలోని మల్లుంగమ్మి జలపాతాన్ని చూసేందుకు త్రిష, రత్న కుమారి, పవిత్ర, అంజలి వెళ్లారు. ఆనందంలో జలపాతం దిగువన ఉన్న రాయి మీదికి వెళ్లి ఒక రీల్ చేయాలనుకున్నారు. ఆ రాయి జారి నీటిలో పడిపోయారు. గోవా బీచ్‌లో తెలుగు డాక్టర్ రమ్యకృష్ణ సెల్ఫీ తీసుకుంటుండగా సముద్ర అలలు ఉధృతమై కొట్టుకుపోయింది. ఇలాంటి ఘటనలు ఎన్నో...
డేంజర్ బోర్డులున్నా వినరా?
పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరెంత చెప్పినా వినకుండా సెల్ఫీల పిచ్చితో, రీల్స్ పిచ్చితో యువత తమ ప్రాణాలను కోల్పోతోంది. డేంజర్ అని తెలిసినా.. డేంజర్ జోన్ బోర్డులున్నా.. ఈ సరదా కోసం ప్రయత్నించి పర్యాటకాన్ని విషాదంగా మార్చుతున్న సంఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. లెక్క చేయని తనం.. రూల్స్‌ను పట్టించుకోని ధోరణి.. డేంజర్ బోర్డులను పట్టించుకోని వైనం మనవాళ్లలోనే కనిపిస్తుంది. విదేశీ పర్యాటకుల్లో ఈ ధోరణి కనిపించదు. రూల్స్ పాటించాలి, జాగ్రత్త బోర్డులను ఫాలో అవ్వాలనే స్పృహ వారిలో ఎక్కువ.
కంటెంట్ క్రియేషన్ ముఖ్యమా?
మనవాళ్లు ఈ మధ్య మనాలి, లడాఖ్, హిమాచల్ వంటి ప్రదేశాలకు వెళ్తున్నారు. ఇండియాలో ఏది ఎక్కడ పడేసినా నడుస్తుంది కాబట్టీ అక్కడ కూడా బాటిల్స్ విసిరేయడం.. స్నాక్స్ ప్యాకెట్స్ డస్ట్ బిన్లో వేయకపోవడం వంటివి చేస్తుంటారు. అమెరికా, చైనా వంటి విదేశీ యాత్రికుల్లో ఈ అలవాటు కనిపించదు. వాళ్లు ఎక్కువగా ‘లీవ్ నో ట్రేస్’ సూత్రం ఫాలో అవుతారు. ఎకో టూరిజం పట్ల వాళ్లకు మనకంటే అవగాహన ఎక్కువ. ఇక మనవాళ్లలో టూరింగ్ కంటే కంటెంట్ క్రియేషన్ మీదే ఎక్కువ ధ్యాస ఉంటుంది. ప్రమాదకరమైన చోట కూడా రిస్క్ చేసి కంటెంట్ క్రియేషన్ చేస్తుంటారు.
వెనకబడ్డామా లేదా?
విదేశీ పర్యాటకులు కూడా ఫొటోలు తీసుకుంటారు. రీల్స్ చేస్తారు. కానీ వాళ్లకు అదే ప్రాధాన్యతాంశం కాదు. పర్యాటక అనుభవం, స్థానిక సంస్కృతి, ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌బుల్ స్పాట్స్ కోసం వెళ్తారు కానీ రూల్స్ వైలేట్ చేయరు. మనోళ్లయితే టూరింగ్ అనేసరికి డ్యాన్స్, మ్యూజిక్, నైట్ పార్టీలు అనుకుంటారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. మనం ఇతరుల ప్రశాంతత గురించి తక్కువ ఆలోచిస్తాం. గ్రూప్ ఎంజాయ్‌మెంట్ మనలో ఎక్కువ. ఉత్సాహం కూడా ఎక్కువే. సివిక్ సెన్స్, ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీలో కాస్త వెనకబడ్డామనే మాట కూడా వాస్తవమే.
రీల్ బ్యాక్‌డ్రాప్‌గా.. మనోళ్లు నిజంగానే ఎకో టూరిజాన్ని ఫాలో అవ్వరు. రీల్స్ కోసం పవిత్ర ప్రదేశాల్లో డ్యాన్స్ చేయడం.. చెత్త విసిరేయడం వల్ల ఇకోసిస్టమ్ దెబ్బతింటుంది. విదేశీయులు తమ చెత్తను తామే మోసుకెళ్తారు. రూల్స్ పాటిస్తారు. మనం మారాలి. ప్రకృతిని ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని రీల్ బ్యాక్‌డ్రాప్‌గా చూడకూడదు.బి. భిక్షపతి, యాక్టివిస్ట్
- బి. భిక్షపతి, యాక్టివిస్ట్
కంటెంట్ కోసమా
టూర్లలో డీజే మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేయడం, కేరింతలు కొట్టడం, సెల్ఫీలు, రీల్స్ కోసం ఏదైనా చేయడం సాధారణం. ఇది ఫన్ అనిపించవచ్చు కానీ ఇతర టూరిస్టులకు ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీయులు ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేస్తారు. మనమేమో కంటెంట్ కోసం ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది.
- పి. మహేందర్, టూరిస్ట్






