రష్యాకు ఇది కఠిన కాలం.. సవాళ్లను అధిగమిస్తాం : పుతిన్

by I. Sairam |

రష్యా ప్రస్తుతం కఠిన కాలాన్ని ఎదుర్కొంటోందని, అయినా అన్ని సవాళ్లను అధిగమిస్తామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

రష్యాకు ఇది కఠిన కాలం.. సవాళ్లను అధిగమిస్తాం : పుతిన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా ప్రస్తుతం ఒక కఠినమైన కాలాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయినప్పటికీ తమ దేశం అన్ని సవాళ్లను అధిగమిస్తుందని, జాతీయ భద్రతను కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబరులో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో అధికార యునైటెడ్ రష్యా పార్టీ సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులు దానిని మరింత బలోపేతం చేశాయని, విలువైన పాఠాలను నేర్పాయని ఆయన పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో తమ పార్టీ మళ్లీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా.. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్, క్షిపణి దాడులు తీవ్రతరం చేయడం, అలాగే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావం కొనసాగుతున్న తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story