- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్మత్‌పేట హైడ్రా కూల్చివేతలకు నిరసన
బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని అస్మత్‌పేటలో ఇటీవల జరిగిన హైడ్రా కూల్చివేతలకు నిరసనగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బాధితులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

దిశ, బాలానగర్ : బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని అస్మత్‌పేటలో ఇటీవల జరిగిన హైడ్రా కూల్చివేతలకు నిరసనగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బాధితులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కూల్చివేతలతో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారికి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అస్మత్‌పేట సర్వే నంబర్–1 భూమి పై ప్రభుత్వం, పురావస్తు శాఖ, ప్రైవేట్ యాజమాన్యం అంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయని, అసలు ఆ భూమి ఎవరిదో రెవెన్యూ శాఖ స్పష్టంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. భూమి ప్రభుత్వానిదైతే అక్రమ లేఅవుట్లు వేసిన వారు, అమ్మకాలు జరిపిన బ్రోకర్లు, సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రారంభంలో హైడ్రా చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములను కాపాడుతుందని ప్రజలు భావించారని, కానీ ప్రస్తుతం పేదల ఇళ్లనే కనికరం లేకుండా కూల్చివేస్తోందని ఆయన ఆరోపించారు. శనివారాలు, ఆదివారాల్లో కోర్టులు పనిచేయని సమయంలోనే కూల్చివేతలు చేపడుతున్నారని, దీంతో బాధితులకు న్యాయం కోరే అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
రోజువారీ కూలి పనులు చేసి, పైసా పైసా కూడబెట్టి చిన్న స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఈటల రాజేందర్ అన్నారు. నిజమైన పేదలను గుర్తించి వారికి శాశ్వత రక్షణ కల్పించాలని, మోసాలకు పాల్పడిన బ్రోకర్లు, అక్రమ భూకబ్జాదారుల పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పన్నులు చెల్లిస్తున్న వారి ఇళ్లను కూడా కూల్చివేయడం అన్యాయమని పేర్కొంటూ, ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. గతంలో తీసుకొచ్చిన జీఓ 58, 59 ప్రకారం అనేక నిర్మాణాలను క్రమబద్ధీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు అదే తరహా సమస్యల పై కూల్చివేతలకు దిగడం సరైందా అని ప్రశ్నించారు. హైడ్రా అధికారుల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన ఎంపీ, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఇళ్లను కూల్చివేయడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని హెచ్చరించారు. పేదలకు అన్యాయం ఆపాలని, అస్మత్‌పేట బాధితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే, అవసరమైతే హైదరాబాద్‌లోని బస్తీల ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.






