- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Online Shopping: మొబైల్ కొనుగోళ్లతో ఈ-కామర్స్‌కు కొత్త ఊపు
గ్లోబల్ టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సంస్థ అడ్మిటాడ్ పరిశీలించిన 30 లక్షలకు పైగా ఆన్‌లైన్ ఆర్డర్లలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2026 జనవరి-మే మధ్య ఆన్‌లైన్ ఆర్డర్లు గతేడాదితో పోలిస్తే 16 శాతం పెరగ్గా, మొత్తం వ్యాపార విలువ (జీఎంవీ) 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. గ్లోబల్ టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సంస్థ అడ్మిటాడ్ పరిశీలించిన 30 లక్షలకు పైగా ఆన్‌లైన్ ఆర్డర్లలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. సగటు ఆర్డర్ విలువ రూ. 3 వేల నుంచి నుంచి రూ. 3,500కు పెరిగింది. అలాగే భారతీయులు మొబైల్ ఫోన్‌ల ద్వారానే ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఆన్‌లైన్ కొనుగోళ్లలో దాదాపు సగం (49 శాతం) మొబైల్ ద్వారానే జరుగుతోంది. కొనుగోలు నిర్ణయాల్లో కంటెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రివ్యూలు, వీడియోలు, కంపారిటీవ్ అనాలసిస్ వంటి కంటెంట్ 20 శాతానికి పైగా కొనుగోళ్లను ప్రభావితం చేయగా, సోషల్ మీడియా క్రియేటర్లు, కమ్యూనిటీలు మరో 11 శాతం కొనుగోళ్లపై ప్రభావం చూపారు. వివిధ బ్రాండ్ల ఆఫర్లను ఒకే చోట అందించే అఫిలియేట్ వెబ్‌సైట్లు కూడా 22 శాతం మంది వినియోగదారులను ఆకర్షించాయి.
భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఇప్పటికీ మార్కెట్‌ప్లేస్‌లదే ఆధిపత్యం. మొత్తం లావాదేవీల్లో 71 శాతానికి పైగా వీటి ద్వారానే జరుగుతున్నాయి. కేటగిరీల వారీగా చూస్తే ఫ్యాషన్ 24 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, హోమ్ గూడ్స్ 21 శాతం, ఎలక్ట్రానిక్స్ 16 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో మొబైల్ సేవల విభాగం అత్యధికంగా 35 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఫర్నిచర్, హోమ్ డెకార్ 19 శాతం, ఎలక్ట్రానిక్స్ 18 శాతం పెరిగాయి. మరోవైపు బ్రాండ్లు కూడా అఫిలియేట్ మార్కెటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. 2026 నాటికి కస్టమర్లను ఆకర్షించే వ్యూహంలో అఫిలియేట్ మార్కెటింగ్‌ను ఉపయోగిస్తున్న బ్రాండ్ల సంఖ్య 7 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు 15 శాతం, కూపన్లు, ప్రోమో కోడ్‌లు మరో 10 శాతం కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేశాయని నివేదిక పేర్కొంది.






