- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FDI: భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల జోరు
విదేశీ కంపెనీలు కొత్తగా చేసిన ఈక్విటీ పెట్టుబడులు భారీగా పెరగడం, ఇప్పటికే చేసిన పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లే విలువ స్థాయి తగ్గడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఆర్‌బీఐ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం, భారత్‌లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఏప్రిల్ నెలలో గణనీయంగా పెరిగాయి. నికర ఎఫ్‌డీఐ గతేడాది ఇదే నెలలో నమోదైన 1.59 బిలియన్ డాలర్ల(రూ. 15 వేల కోట్ల)తో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా పెరిగి 6.58 బిలియన్ డాలర్ల(రూ. 62.08 వేల కోట్ల)కు చేరింది. అంతకుముందు మార్చిలో ఇది కేవలం 917 మిలియన్ డాలర్లు(రూ. 8,650 కోట్లు) మాత్రమే వచ్చాయి. విదేశీ కంపెనీలు కొత్తగా చేసిన ఈక్విటీ పెట్టుబడులు భారీగా పెరగడం, ఇప్పటికే చేసిన పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లే విలువ స్థాయి తగ్గడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఆర్‌బీఐ తెలిపింది. మొత్తం ఎఫ్‌డీఐ ప్రవాహాలు కూడా 65 శాతం పెరిగి 15.29 బిలియన్ డాలర్ల(రూ. 1.44 లక్షల కోట్ల)కు చేరాయి. ఇందులో ఈక్విటీ పెట్టుబడులే 12.42 బిలియన్ డాలర్ల(రూ. 1.17 లక్షల కోట్ల)తో ప్రధాన వాటా దక్కించుకున్నాయి. ఆర్థిక సేవలు, రిటైల్-హోల్‌సేల్ వాణిజ్యం, తయారీ, కంప్యూటర్ సేవలు కలిపి మొత్తం పెట్టుబడుల్లో 80 శాతానికి పైగా వాటాను ఆకర్షించాయి. విదేశీ పెట్టుబడుల్లో 75 శాతానికి పైగా జపాన్, సింగపూర్, మారిషస్ నుంచే వచ్చాయి.
అయితే మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మాత్రం ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాయి. ఏప్రిల్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి 7.26 బిలియన్ డాలర్లు(రూ. 68.5 వేల కోట్లు) వెనక్కి తీసుకున్నారు. ఇందులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల వాటానే 6.83 బిలియన్ డాలర్లు(రూ. 64.44 వేల కోట్లు). అయినప్పటికీ, బలమైన ఎఫ్‌డీఐ ప్రవాహాల కారణంగా మొత్తం విదేశీ పెట్టుబడుల నికర ఉపసంహరణ కేవలం 680 మిలియన్ డాలర్ల(రూ. 6,417 కోట్ల)కు పరిమితమైంది. ఇది మార్చిలో నమోదైన 13.94 బిలియన్ డాలర్ల(రూ. 1.31 లక్షల కోట్ల)తో పోలిస్తే గణనీయమైన మెరుగుదల. మరోవైపు భారతీయ కంపెనీలు విదేశాల్లో చేసిన పెట్టుబడులు కూడా పెరిగి 4.82 బిలియన్ డాలర్ల(రూ. 45.48 వేల కోట్ల)కు చేరడం, దేశీయ కంపెనీలు అంతర్జాతీయంగా విస్తరిస్తున్నాయనే సంకేతాలను ఇస్తోంది.






