- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రంగులు మారుతున్న పార్టీలు
పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచిత్ర పొత్తులు పొడసూపుతున్నాయి. ఎన్నికలు జరగలేదు.

దిశ, నిర్మల్ ప్రతినిధి: పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచిత్ర పొత్తులు పొడసూపుతున్నాయి. ఎన్నికలు జరగలేదు. ఇంకా ఒక రోజు టైం ఉంది. ఫలితాలకు మూడు రోజుల సమయం ఉంది. ఆలు లేదు... సూలు లేదు... అల్లుడు పేరు సోమలింగం అన్నట్లు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు విచిత్ర పొత్తులకు తెరలేపాయి. ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం లేని ప్రధాన రాజకీయ పక్షాలు ముందు నుంచే... తాము గెలిస్తే మీ మద్దతు కావాలంటూ పార్టీల ముఖ్య నేతల నడుమ సంప్రదింపులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ శాసనసభ్యులు లక్ష్యంగా... ఈ రాజకీయ పక్షమైనా ఇంకో పార్టీతో దోస్తీ చేసేందుకు సిద్ధపడుతున్న సంకేతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఎటొచ్చి తాము గెలవాలి... సిట్టింగ్ ఎమ్మెల్యే పక్షం ఓడిపోవాలి.. అదే రాజకీయం అన్నట్లుగా పురపాలక సంఘాల ఎన్నికలు మారడం రాజకీయాల్లో విస్తు గొలుపుతున్నాయి.
తీవ్ర పోటీ..
ప్రస్తుతం జరుగుతున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తూర్పు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి పార్టీల నడుమ తీవ్ర పోటీ కనిపిస్తున్నది బిజెపి ప్రభావం కూడా అక్కడక్కడ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల నడుమనే ఉంది. ఇక పశ్చిమ జిల్లాలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నడుమ పోటీ కనిపిస్తున్నది. బైంసా మున్సిపాలిటీలో బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు మున్సిపాలిటీలు మినహా ఎక్కడ కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఏకపక్షంగా గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి పొత్తులు కుదుర్చుకునే పనిలో పడ్డాయి. రాజకీయంగా అనైతికం అయినప్పటికీ... ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను వ్యతిరేకించడం లక్ష్యంగా పొత్తులు కుదుర్చుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొన్నిచోట్ల కీలకం..
పెద్ద పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్న పురపాలక సంఘంలో పొడిపొడిగా అక్కడక్కడ గెలిచే పార్టీలు ఇప్పుడు జరుగుతున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ జిల్లాలో ప్రస్తుతం నెలకొని ఉన్న మున్సిపల్ ఎన్నికల పోరు చూస్తుంటే... బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం- బిజెపి నడుమ పోటీ ఉంది. ఇక్కడ ఇండిపెండెంట్‌లు ఎక్కడ గెలిచినా వారి అవసరం ఎక్కువగా పడే పరిస్థితులు ఉన్నాయి. నిర్మల్‌లో కాంగ్రెస్- బిజెపి నడుమ తీవ్ర పోటీ ఉంది. ఈ మున్సిపాలిటీలో కొన్ని సీట్లు గెలిచినప్పటికీ చైర్ పర్సన్ పదవి పొందే పార్టీకి ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీలో మద్దతు అవసరం అయ్యేలా మారుతుందని చెబుతున్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు పార్టీలు తీవ్రంగా కొట్లాడుతున్నాయి.
ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గెలిచే స్థానాలను బట్టి బిజెపి టిఆర్ఎస్ జత కలిసే అవకాశం ఉంది. ఇక 66 తూర్పు జిల్లాకు సంబంధించి ఖ్యాతన్ పల్లి పురపాలక సంఘంలో కమ్యూనిస్టు, భారత్ రాష్ట్ర సమితి పార్టీలు జతకడుతున్నాయి. బెల్లంపల్లి చెన్నూరు పురపాలక సంఘాల్లో పరోక్షంగా భారత్ రాష్ట్ర సమితి, బిజెపి జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్‌లో సైతం అనైతిక పొత్తులు కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆసిఫాబాద్ పురపాలక సంఘంలో అధికార కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు పరోక్షంగా బిజెపి, భారత్ రాష్ట్ర సమితి అంతర్గత పొత్తుకు దిగినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బైంసా, కాగజ్ నగర్ తదితర మున్సిపాలిటీలలో ఫార్వర్డ్ బ్లాక్ బహుజన్ సమాజ్ పార్టీలు సైతం కొన్నిచోట్ల ఉనికి చాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక్క సీటు అవసరం పడితే వీరే అత్యంత కీలకంగా మారుతారని చెబుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అధిష్టానాలను పక్కనపెట్టి స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలను బట్టి ఎదుటి పక్షాలతో పాటు చిన్న చిన్న పార్టీల నుంచి గెలిచిన వారిని, స్వతంత్రులను కలుపుకొని మున్సిపల్ చైర్మన్ పదవులను పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు విస్తు గొలుపుతున్నాయి. అనైతిక పొత్తులపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది.






