బాన్సువాడ ఎంపీపీ కార్యాలయంలో పార్కింగ్ సమస్యలు

by Batti.Sumithra |

బాన్సువాడ మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పార్కింగ్ వ్యవస్థ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బాన్సువాడ ఎంపీపీ కార్యాలయంలో పార్కింగ్ సమస్యలు
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పార్కింగ్ వ్యవస్థ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద సంబంధిత అధికారులు, సిబ్బంది తమ వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడంతో కార్యాలయానికి వచ్చే ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వివిధ గ్రామాల నుంచి ప్రజలు పింఛన్లు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, ఇతర పరిపాలనా అవసరాల కోసం కార్యాలయాన్ని సందర్శిస్తుంటారు. అయితే ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద కార్లు, ద్విచక్ర వాహనాలు అడ్డంగా పార్క్ చేయటం వల్ల వృద్ధులు, మహిళలు, వికలాంగులు కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కొన్నిసార్లు అత్యవసర పనుల కోసం వచ్చిన ప్రజలు కూడా వాహనాల కారణంగా కార్యాలయంలోకి వెళ్లేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజా సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోనే ఇటువంటి పరిస్థితులు ఉండటం విచారకరమని వారు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పార్కింగ్ స్థలం ఉన్నప్పటికీ, కొందరు అధికారులు తమ వాహనాలను నేరుగా ముఖద్వారం వద్దనే నిలిపివేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కార్యాలయ సౌకర్యాలు ప్రజలకు కాకుండా అధికారుల వాహనాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య పై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రధాన ద్వారం వద్ద వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలని, ప్రజల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కార్యాలయ ఆవరణలో క్రమబద్ధమైన పార్కింగ్ విధానాన్ని అమలు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story