కామారెడ్డిలో పరిషత్ ఎన్నికల సందడి: ఓటరు జాబితాకు ఏప్రిల్ 23 డెడ్ లైన్!

by Malleboina Mahesh |

కామారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఓటరు జాబితా రూపకల్పన వేగవంతమైంది. ఏప్రిల్ 23 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

కామారెడ్డిలో పరిషత్ ఎన్నికల సందడి: ఓటరు జాబితాకు ఏప్రిల్ 23 డెడ్ లైన్!
X

కామారెడ్డి జిల్లాలో రెండేళ్లుగా వాయిదా పడుతున్న పరిషత్ ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు జాబితా రూపకల్పన, వార్డు మ్యాపింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ లోపు ఓటరు జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు. దీంతో మే లేదా జూన్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రామాల్లో ఇవే చివరి ఎన్నికలు కావడంతో పోటీ చేసేందుకు ఆశావాహులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. పార్టీ గుర్తులపై పోరు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా గెలుపు సాధించాలని ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాల ఆధారంగా గెలిచే అభ్యర్థుల కోసం పార్టీలు వెతుకులాట ప్రారంభించాయి.

దిశ, కామారెడ్డి: ఎప్పుడెప్పుడా అని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముహూర్తం ఖరారవుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓటరు జాబితాలను సరిచేయడం, వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించింది. 2024 జూలైలోనే పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసినప్పటికీ, దాదాపు రెండేళ్లుగా ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల సంఘం అకస్మాత్తుగా ఓటరు జాబితాపై దృష్టి సారించడంతో గ్రామాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఎన్నికల ప్రకటనకు ముందే ఓటరు జాబితా ఖరారు కావాల్సి ఉన్నందున, అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.

సాఫ్ట్‌వేర్ ద్వారా మ్యాపింగ్.. ఏప్రిల్ 23 డెడ్ లైన్..

ఎన్నికల సంఘం నుంచి అందిన అదనపు ఓటర్ల డేటాను గ్రామపంచాయతీ వార్డులకు అనుసంధానం చేసే ప్రక్రియ మొదలైంది. ‘టెల్-ఫోల్’ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రతి ఓటరును వారి పోలింగ్ స్టేషన్‌కు మ్యాపింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు. మండలస్థాయి అధికారులు ఓటర్ల వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని, వారి చిరునామా ఆధారంగా వార్డులను గుర్తించి, జిల్లాస్థాయి అధికారులు ధృవీకరించిన తర్వాత పోలింగ్ స్టేషన్లకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటికీ ఏప్రిల్ 23, 2026 వరకు గడువు విధించడం కీలక పరిణామంగా మారింది. దీంతో మే నెలలో లేదా జూన్ మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహులు.. గ్రామాల్లో సందడి

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వెళ్లి ఓడిన వారు, రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరంగా ఉన్నవారు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. గ్రామాల్లో ఇవే ఆఖరి ఎన్నికలు కావడంతో ఆశావహులు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. సంకేతాలు వెలువడడంతో ఆశావహులు తమ అనుచరులు, ఓటర్లను పలకరిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. టీ కొట్టుల వద్ద, గ్రామ రచ్చబండల వద్ద ఇప్పుడు పరిషత్ ఎన్నికల చర్చలే ఊపందుకున్నాయి.

గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాల ఊపుతో, ఈ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, ప్రతిపక్షాలు ఈ ఎన్నికల ద్వారా పుంజుకోవాలని ఆశిస్తున్నాయి. రిజర్వేషన్లు, సామాజిక సమీకరణలు, స్థానిక ప్రభావాన్ని బట్టి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల కోసం పార్టీలు ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టాయి. తమ ప్రధాన అనుచరుల ద్వారా అభ్యర్థుల వివరాలు సేకరిస్తూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి.

Next Story