పాపికొండలు టూరిస్ట్ బోటుకు తప్పిన పెను ప్రమాదం.. 38 మంది పర్యాటకులు సేఫ్

by Muthe.Rajitha |

పాపికొండలు టూరిస్ట్ బోటుకు తృటిలో పెను ప్రమాదం తప్పడంతో 38 మంది పర్యాటకులు ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డారు.

పాపికొండలు టూరిస్ట్ బోటుకు తప్పిన పెను ప్రమాదం.. 38 మంది పర్యాటకులు సేఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం పాపికొండలు టూరిస్ట్ బోటుకు తృటిలో పెను ప్రమాదం తప్పడంతో 38 మంది పర్యాటకులు ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డారు. ఆదివారం ఉదయం పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) బోటులో నీరు చేరడాన్ని గమనించిన సిబ్బంది సకాలంలో అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. పాపికొండలు విహారయాత్ర కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని పర్యాటకులంతా బోటు పాయింట్‌కు చేరుకోగా, ప్రయాణానికి రెండు గంటల ముందే బోటు నీటిలో సాధారణం కంటే ఎక్కువగా కిందకు దిగి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. లోపలి భాగాలను పరిశీలించగా బోటు ముందు భాగం జాయింట్‌లో ఏర్పడిన స్వల్ప పగులు వల్ల నీరు చేరుతున్నట్లు తేలింది. వెంటనే స్పందించిన సిబ్బంది లోపలి నీటిని బయటకు తోడేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పర్యాటకులను సురక్షితంగా 'విజయగంగ' అనే మరో బోటులో విహారయాత్రకు పంపించారు.

జలవనరుల శాఖ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం నాటి ప్రయాణం ముగిసిన తర్వాత రాత్రి వేళల్లో ఈ పగులు ఏర్పడి ఉండవచ్చని, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం వల్ల పర్యాటకులను బోటు ఎక్కనివ్వలేదని స్పష్టం చేస్తూ, పూర్తి మరమ్మతులు జరిగే వరకు సదరు బోటు విహారయాత్రకు అనుమతించేది లేదని ప్రకటించారు. కాగా బోటు ప్రయాణానికి ముందే ప్రమాదాన్ని గుర్తించడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story