- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు పునర్విభజన.. కొత్త నియోజకవర్గాల జోరు!
పాలమూరు రాజకీయాల్లో పునర్విభజన సెగ! ఉమ్మడి జిల్లాలో కొత్తగా 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం? ఐజ, కొత్తకోట నియోజకవర్గాలపై జోరుగా చర్చ.

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ అలజడి మొదలయ్యింది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయము పాఠకులకు విధితమే.. కొత్తగా 7 నుండి 8 అసెంబ్లీ స్థానాలు ఏర్పడను ఉండడంతో.. మొత్తం 21 స్థానాలకు పైగా పెరగనున్నాయి. మరో పార్లమెంట్ స్థానం పెరగడంతో ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు స్థానాలు మూడుకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయ నిపుణులు, విద్యావేత్తల నుండి సేకరించిన వివరాల ప్రకారం కొత్త నియోజకవర్గాల ఏర్పాటు ఈ క్రింది విధంగా ఉండవచ్చని అంచనాలు జరుగుతున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా..
ప్రస్తుతము ఈ జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు ఉండగా... కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణం మధ్యలో నుంచి వెళ్లే రైచూర్ రోడ్డు తూర్పు భాగంకు భూత్పూరు, మూసాపేట మండలాలను కలిపి తూర్పు భాగం, రాయచూరు రోడ్డు నుండి మహబూబ్ నగర్ పట్టణానికి పడమర ఉన్న పట్టణ పట్టణ ప్రాంతానికి హన్వాడ, కోయిలకొండ మండలాలతో ఒక నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్, నవాబుపేటలతో మరో నియోజకవర్గం నవాబుపేట లేదా బాలానగర్ కేంద్రంగా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉన్న జడ్చర్ల మున్సిపాలిటీ, జడ్చర్ల, మిడ్జిల్ మండలాలకు ( అవసరమైతే ) తిమ్మాజిపేట మండలాన్ని చేర్చే అవకాశం ఉంది. దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, అడ్డాకుల మండలాలతో దేవరకద్ర నియోజకవర్గ కొనసాగనుంది.
వనపర్తి జిల్లాలో ప్రస్తుతము ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఉంది. ఈ జిల్లాలో రెండు కొత్తగా అసెంబ్లీ స్థానాలు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత, ఆత్మకూరు, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపూర్ ను కలిపి కొత్తకోట లేదా అమరచింత నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావిని కలుపుకోవడం ద్వారా పెబ్బేరు నియోజకవర్గం ఏర్పాటు అవుతుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. వనపర్తి మున్సిపాలిటీ, మండల ప్రాంతాలతో పాటు ఖిల్లా గణపురం, పెద్దమందడి, గోపాల్ పేట, రేవల్లి మండలాలకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్ మండలాన్ని కలుపుకోవడం ద్వారా వనపర్తి నియోజకవర్గం కొన్ని మార్పులు చేర్పులు సంతరించుకుంటాయి.
జోగులాంబ గద్వాల..
ఈ జిల్లాలో ఇప్పటికే అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొత్తగా ఐజ అసెంబ్లీ స్థానం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలాన్ని కలిపి ఐజ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అంశం మొదటి నుండి ప్రచారంలో ఉంది. మిగిలిన మండలాలతో అలంపూరు, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు యథావిధిగా కొనసాగనున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా..
నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, కల్వకుర్తి , అచ్చంపేట నియోజకవర్గాలకు అదనంగా మరొక నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, చారగొండ, ఉప్పునుంతల మండలాలకు సమీపంలో ఉండే మరో మండలాన్ని చేర్చుకోవడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరు అసెంబ్లీ నియోజకవర్గం గా ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీ, కల్వకుర్తి, వెల్దండ మండలాలకు ప్రస్తుతము జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఊరుకొండ చేర్చి కల్వకుర్తి నియోజకవర్గం, అచ్చంపేట పట్టణము, మండలము, అమ్రాబాద్, పదర మండలాలకు తెలకపల్లి మండలాన్ని కలిపి అచ్చంపేట నియోజకవర్గం కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి. కొల్లాపూర్ నియోజక వర్గం తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీ, మండలం, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవల్లి, ఏదుల మండలాలతో కొనసాగనుంది. నాగర్ కర్నూల్ పట్టణము, గ్రామీణ ప్రాంతాలతో పాటు బిజినపల్లి, తాడూరు మండలాలతో నాగర్ కర్నూల్ నియోజకవర్గం కొనసాగనుంది.
నారాయణపేట జిల్లా..
నారాయణపేట జిల్లాలో ప్రస్తుతం మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు పూర్తిస్థాయిలోనూ, కొడంగల్ నియోజకవర్గ సగభాగం మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలో కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతము కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి మండలాలతో పాటు పరిగి నియోజకవర్గంలో ఉన్న మహమ్మదాబాద్, గంగేడు మండలాలను కలిపి కోస్గి లేదా మద్దూరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గం లో ఉన్న మరికల్, ధన్వాడ, మక్తల్ నియోజకవర్గంలో ఉన్న నర్వ మండలాలతో ధన్వాడ నియోజకవర్గ ఏర్పాటు అంశం తెరపైకి వస్తోంది. నారాయణపేట పట్టణం, మండలం, దామరగిద్ద మండలానికి మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరును కలిపి నారాయణపేట నియోజకవర్గం ను కొనసాగిస్తారు. మక్తల్ మున్సిపాలిటీ, మండల ప్రాంతాలతో కృష్ణ, మాగనూరు మండలాలతో మక్తల్ నియోజకవర్గం ఒక చిత్రం మారనుంది.
కొత్త పార్లమెంట్ వనపర్తి లేదా గద్వాల : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక పార్లమెంటు స్థానం పెరగనుంది. వనపర్తి, గద్వాల జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చడం ద్వారా గద్వాల లేదా వనపర్తి నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలుగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.
మహిళలకు ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ రిజర్వ్..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 21 కి పైగా, పార్లమెంట్ స్థానాల సంఖ్య మూడుకు చేరనుంది. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే పక్షంలో ఉమ్మడి జిల్లాలో మహిళలకు ఏడు నుంచి 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ రిజర్వ్ కానుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వ్ స్థానాలలోనూ మార్పులు చేర్పులు ఉండవచ్చు.
మొదలైన అలజడి..
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తప్పనిసరిగా జరగనుంది అని తేలడముతో ఆశావాహులలో అలజడి మొదలైంది. ప్రస్తుత సిట్టింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తాము పోటీ చేయాలి అనుకున్న నియోజకవర్గాల స్వరూపం ఎలా ఉండబోతుంది..!? మహిళ, ఎస్సీ లేదా ఎస్టీలకు రిజర్వు అవుతుందా అన్న అంశాలపై ఆశావాహులు దృష్టి సారిస్తున్నారు. మొత్తం పై అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలలో ఆసక్తి రేపుతోంది.






