ఒడిశాలో పాక్ స్పై అరెస్ట్

by Muthe.Rajitha |

పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణలతో భద్రతా దళాలు షేక్ ఇమ్రాన్ అనే యువకుడిని భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు.

ఒడిశాలో పాక్ స్పై అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణలతో జాతీయ భద్రతా దళాలు షేక్ ఇమ్రాన్ (22) అనే యువకుడిని భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఒడిశా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో, ఏప్రిల్ 10న భువనేశ్వర్‌లోని గంగానగర్ ప్రాంతంలో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఒడిశా రాజధానిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌ పాక్ స్పైగా వ్యవహరిస్తున్నాడనే నిఘా వర్గాల సమాచారంతో అరెస్టు చేసి, భువనేశ్వర్ ఎస్‌డీజేఎం (SDJM) కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నాలుగు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తరలించారు.

బయటపడిందిలా...

ఢిల్లీలో ఇటీవల జరిగిన మరికొంతమంది ఉగ్ర నేపథ్యం ఉన్న యువకుల అరెస్టుల తర్వాత, వారి సోషల్ మీడియా డేటాను విశ్లేషించిన కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇమ్రాన్ గురించి కీలక సమాచారం లభించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా ఇమ్రాన్ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు, రాడికల్ గ్రూపులలో యాక్టివ్‌గా ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా, ఇతడికి పాకిస్థాన్‌కు చెందిన అనుమానాస్పద వర్గాలతో లింకులు ఉండటం, దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఇమ్రాన్ ప్రస్తుతం నిరుద్యోగిగా ఉంటూ, డిజిటల్ మాధ్యమాల ద్వారా తీవ్రవాద భావజాలాలను వ్యాప్తి చేస్తున్నాడని భావిస్తున్నారు.

అత్యంత గోప్యత

అరెస్టు చేసిన సమయంలో ఇమ్రాన్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు మరియు ఇతర డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. భువనేశ్వర్-కటక్ కమిషనరేట్, ఢిల్లీ పోలీసుల మధ్య సమన్వయంతో ఈ కేసును అత్యంత గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే అంశంపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, భువనేశ్వర్ పోలీసులు అధికారికంగా ఎటువంటి విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.

Next Story