ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 11 మంది పిల్లలతో సహా 13 మంది మృతి!

by Malleboina Mahesh |

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది చిన్నారులతో సహా 13 మంది పౌరులు మృతి చెందారు.

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 11 మంది పిల్లలతో సహా 13 మంది మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాల నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దాటి వైమానిక దాడులకు (Cross-border Airstrikes) పాల్పడిందని ఆఫ్ఘన్ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదికల ప్రకారం.. ఈ దారుణ దాడిలో కనీసం 13 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత ఘోరమైన ఘర్షణల్లో ఇది ఒకటిగా నిలిచింది.

సాధారణ పౌరులే లక్ష్యంగా బాంబుల వర్షం

పాకిస్తాన్ సైన్యం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ వైమానిక పరిధిని ఉల్లంఘించిందని, సరిహద్దుకు సమీపంలోని కునార్, ఖోస్ట్, పక్తికా ప్రాంతాల్లోని సామాన్య పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్షిపణి దాడుల ధాటికి ఇళ్లు ధ్వంసమై 11 మంది అమాయక పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి చివర్లో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత సరిహద్దు కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, తాజా దాడితో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ఇరు దేశాల ఘర్షణల వల్ల 372 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించగా, 397 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి (UN) గత నెల విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం గమనార్హం.

Next Story