- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్ ఎఫెక్ట్.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత
పశ్చిమాసియా యుద్ధ పరిణామాల వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి పాక్ ప్రధాని అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరిన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడంతో పాకిస్థాన్ తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం నుండి ఏకంగా 30 శాతం వరకు కోత విధించేందుకు ఆదేశాలు జారీ చేసారు. ఈ విధంగా ఉద్యోగుల జీతాల నుంచి సేకరించిన నిధులను నేరుగా ప్రజా సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తామని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.
దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే వరకు ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవని ప్రభుత్వం చెబుతోంది. కేవలం సాధారణ ఉద్యోగులపైనే కాకుండా, పాలనలో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులపై కూడా షరీఫ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు రాబోయే రెండు నెలల పాటు తమ పూర్తి వేతనాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నిధులను కూడా పొదుపు నిధికి మళ్లిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా, వివిధ కార్పొరేషన్ల బోర్డుల్లో సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్రతినిధులకు ఇకపై ఎలాంటి 'పార్టిసిపేషన్ ఫీజు' చెల్లించకూడదని నిర్ణయించారు.
ప్రభుత్వ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో మంత్రుల విదేశీ పర్యటనలపై విధించిన నిషేధాన్ని మరింత కాలం పొడిగించారు. దీనికి తోడు, ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని ఆదేశిస్తూ.. వారికి కేటాయించిన ఇంధనంలో 50 శాతం కోత పెట్టారు. రాబోయే రెండు నెలల్లో 60 శాతం ప్రభుత్వ వాహనాలను రోడ్లపైకి రాకుండా నిలిపివేయాలని, ఈ నిబంధనలు సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి 'థర్డ్ పార్టీ ఆడిట్' నిర్వహిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.






