పాకిస్తాన్‌లో ఇంధన బాంబు: లీటరుపై రూ. 55 పెంచుతూ షాకింగ్ నిర్ణయం.. చరిత్రలోనే అత్యధికం!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-07 11:00:11  IST  )

పాకిస్తాన్‌లో ఇంధన బాంబు! లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ. 55 పెంపు. దేశ చరిత్రలో ఇదే అత్యధికం. ఇరాన్ యుద్ధం తర్వాత సామాన్యుడిపై మోయలేని భారం.

పాకిస్తాన్‌లో ఇంధన బాంబు: లీటరుపై రూ. 55 పెంచుతూ షాకింగ్ నిర్ణయం.. చరిత్రలోనే అత్యధికం!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఇస్లామిక్ కంట్రీస్ (Islamic Countries) పైనే అధికంగా చూపుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు యుద్ధం కారణంగా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఎదురవుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం (Government of Pakistan) తన దేశ ప్రజలపై భారీ భారాన్ని మోపింది. అర్ధరాత్రి తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా PKR 55 (పాకిస్థానీ రూపాయలు) చొప్పున పెంచింది. పాకిస్తాన్ చరిత్రలో ఇంధన ధరలను ఒకేసారి ఇంత భారీగా పెంచడం ఇదే తొలిసారి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిన మొదటి ప్రధాన ప్రభావంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా తాజా పరిణామాలపై పాకిస్తాన్ మంత్రి వర్గం (Pakistan Cabinet) చర్చించింది. అనంతరం మార్చి 7న అర్ధరాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్, ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ ఈ పెంపును అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపుతో హై-స్పీడ్ డీజిల్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 280.86 నుండి ఏకంగా రూ. 335.86 కు చేరుకుంది. అంటే కేవలం ఒక్కరోజులోనే డీజిల్ ధరపై దాదాపు 20 శాతం భారం పెరిగింది. దేశంలో పెట్రోలియం నిల్వలు సరిపడా ఉన్నాయని, కొరత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.

అయితే, ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం (Financial crisis)తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టు గా మారింది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఐఎంఎఫ్ (IMF) షరతులు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ధరలు వచ్చే వారం నుండే అమల్లోకి రానున్నాయి.

బంగ్లాదేశ్‌లో 'పానిక్ బయింగ్'.. యుద్ధ భయంతో పెట్రోల్ బంకులకు పోటెత్తిన వాహనాలు.. లీటర్లపై పరిమితి!

Next Story