భారతీయుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ చంపేస్తాం.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

భారత్‌పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు! ఇళ్లల్లోకి చొరబడి చంపుతామని ప్రగల్భాలు. 'ఆపరేషన్ సిందూర్' ఇంకా ముగియలేదన్న రాజ్‌నాథ్ సింగ్.

భారతీయుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ చంపేస్తాం.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి తన నోటి దురదను ప్రదర్శించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ను ఉద్దేశించి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. "భవిష్యత్తులో యుద్ధం వస్తే భారత భూభాగంలోకి చొరబడి, భారతీయుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ చంపేస్తాం" అంటూ ఆయన ప్రగల్భాలు పలికారు. గతేడాది జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తూ, ఈసారి యుద్ధం జరిగితే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, భారత్ అంతర్భాగంలోకి దూసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. అయితే, గత ఏడాది భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) దెబ్బకు పాక్ విలవిలలాడిన విషయాన్ని ఆయన సౌకర్యవంతంగా మర్చిపోయారని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.

రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు ముందే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితిని అడ్డు పెట్టుకుని పాక్ ఏవైనా దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తే, భారత్ ఇచ్చే సమాధానం ఊహాతీతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "మా పొరుగు దేశం ఏదైనా పొరపాటు చేస్తే, మా స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు అన్న విషయం వారు గుర్తుంచుకోవాలి" అని రాజ్‌నాథ్ సింగ్ పాక్‌కు గట్టి సందేశాన్ని పంపారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న తరుణంలో, పాక్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా తన అంతర్గత బలహీనతలను కప్పి పుచ్చుకోవాలని చూస్తోందని భారత్ భావిస్తోంది.

Next Story