హైదరాబాద్‌లో నీటి వృథాను అరికట్టేందుకు పానీ యాప్

by Malleboina Mahesh |

నగరంలో మంచినీటి డిమాండ్ భారీగా పెరుగుతున్నది.. కానీ సరఫరా అయ్యే నీళ్లు మాత్రం పెరగడం లేదు. దీంతో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది.

హైదరాబాద్‌లో నీటి వృథాను అరికట్టేందుకు పానీ యాప్
X

దిశ, సిటీ బ్యూరో : నగరంలో మంచినీటి డిమాండ్ భారీగా పెరుగుతున్నది.. కానీ సరఫరా అయ్యే నీళ్లు మాత్రం పెరగడం లేదు. దీంతో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది. తాగునీటిని ఇండ్లు కడగడానికి, కార్లు, బైకులు, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని జలమండలి గుర్తించింది. ఇప్పటికే పలువురికి పైనాల్టీ కూడా వేసింది. ఇలాంటివి పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు సైతం జారీచేసింది. అయినా నీటివృథా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీన్ని అరికట్టడానికి జలమండలి ప్రత్యేకంగా ‘పానీ యాప్’ ను తీసుకొచ్చింది. దీని కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10వేల మంది వలంటీర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఇక నుంచి ఎక్కడ ఎవరు నీటిని వృథా చేసినా.. పానీ యాప్ ద్వారా భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.

14 లక్షల నీటి కనెక్షన్లు.. 600 ఎంజీడీలు సరఫరా..

గ్రేటర్ హైదరాబాద్ లో జనాభా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీలను విలీనం చేయడంతో పరిధి 2053చ.కి.మీలకు పెరగడంతోపాటు జనాభా 1.34 కోట్లకు చేరిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం గ్రేటర్ లో 14 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. నగర విస్తరణతోపాటు బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్ మెంట్లు రావడంతో తాగునీటి వినియోగం సైతం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030 వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 300 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో.. అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2,3 లను రూపకల్పన చేసింది.

2027 సంవత్సరం వరకు.. హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతున్నది. 2047 నాటికి ఈ సంఖ్య 1114 ఎంజీడీలుగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు. భారీగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నాయి.. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో మంచి నీటి డిమాండ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది.. డిమాండ్ కు అనుగుణంగా సప్లై మాత్రం లేదు. 2014 లో నగరానికి వస్తున్న 600 ఎంజీడీల నీళ్లే ఇప్పుడు వస్తున్నాయి.. దీంతో ఉన్న నీటినే అందరికీ సప్లై చేస్తోంది జలమండలి.. నగరవ్యాప్తంగా 14 లక్షలకు పైగా ఉన్న కనెక్షన్లకు ఈ నీటినే సరఫరా చేస్తోంది.

‘పానీ యాప్’తో పర్యవేక్షణ..

గ్రేటర్‌లో పెరుగుతున్న నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నీటి వృథాను అరికట్టే లక్ష్యంతో పానీ ( పబ్లిక్ యాక్షన్ ఫర్ నాన్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్షియేటివ్) అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ ద్వారా పర్యవేక్షించనుంది. ఇప్పటివరకు తాగునీటిని వృథా చేస్తున్న వారిని వాటర్ బోర్డు అధికారులు గుర్తించి వారికి ఫైన్లు విధిస్తున్నారు. తాగునీటి వృథాను పర్యవేక్షించడానికి మొదటి దశలో 10 వేల మంది వాటర్ వాలంటీర్లకు అందుబాటులోకి తీసుకురావాలని జలమండలి నిర్ణయించింది. వీరికి ప్రత్యేక లాగిన్ ఐడీలు ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

తమ తమ పరిధుల్లో నీటి వృథా జరుగుతున్న ప్రాంతాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నారు. నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించి ఈ యాప్ ద్వారా వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెబుతున్నారు. నీటి వృథాపై వాటర్ వాలంటీర్లు యాప్ లో ఫొటో, వివరాలు నమోదు చేస్తారు. రోడ్లపై నీరు వృథాగా పారుతున్న దృశ్యాలు, లీకేజీలు, అక్రమ నీటి వినియోగం, ఓవర్‌ ఫ్లో ట్యాంకులు, ఇంటి పరిసరాలు కడగడం, వాహనాలు కడగడం లాంటివి ఫొటో తీసి, లోకేషన్, టైమ్ యాప్ లో ఎంటర్ చేస్తారు. ఆయా వివరాలను జలమండలి అధికారులు నిర్ధారణ చేసి నిబంధనల ప్రకారం నీటిని వృథా చేసిన వ్యక్తి లేదా సంస్థపై ఫైన్ విధించేందుకు చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఫీల్డ్ ఇంజినీర్లను పంపించి తక్షణమే సమస్యను పరిష్కరించనున్నట్టు చెబుతున్నారు.

ఫైన్లకే పరిమితం కాదు.. అవగాహన సైతం : ఎండీ అశోక్ రెడ్డి

ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పానీ యాప్ ద్వారా కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా, ప్రజల్లో నీటి విలువపై అవగాహన పెంచడం, నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచడం ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా ఈ యాప్‌ ను విస్తరించే యోచన ఉంది. వచ్చే వేసవిలో నీటి డిమాండ్ భారీగా పెరగనున్న నేపథ్యంలో, ఇప్పటి నుంచే నీటి వృథాను నియంత్రించాలి. అందుకే టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణతో పాటు, వలంటీర్ల సహకారంతో నగరంలో నీటి వినియోగంపై కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నీటిని ఆదా చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం. పానీ యాప్‌తో నీటి వృథాపై ఇక కఠిన చర్యలు తప్పవు.

Next Story