ఈ ఏడాది ఇప్పటివరకు స్టార్టప్ కంపెనీల్లో 12 వేల ఉద్యోగాల తొలగింపు!

by Dishanational1 |
ఈ ఏడాది ఇప్పటివరకు స్టార్టప్ కంపెనీల్లో 12 వేల ఉద్యోగాల తొలగింపు!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్ కంపెనీలతో పాటు దేశీయంగా ప్రతికూల పరిస్థితుల వల్ల స్టార్టప్‌లలో ఆర్థిక కష్టాల కారణంగా ఈ ఏడాదిలో 12,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ క్రంచ్‌బేస్ ప్రకారం, స్టార్టప్‌లు ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఎక్కువ ప్రయోజనాలను పొందిన కంపెనీలు విలువ పరంగా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.అన్ని రకాలుగా క్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో ఈ స్టార్టప్‌లు కొత్తగా నిధులను సేకరించడంలో విఫలమవుతున్నాయి.అంతర్జాతీయంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సహా ఆర్థిక సేవల సంస్థ రాబిన్‌హుడ్, ఇంకా అనేక క్రిప్టోకరెన్సీ ఆధారిత కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటికే 22,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించాయి.

ప్రధానంగా క్రిప్టో మార్కెట్లో ఆర్థిక ప్రతికూలత అధికంగా ఉంది. విలువ క్షీణిస్తున్న క్రమంలో క్రిప్టో ఎక్స్‌ఛేంజీలైన కాయిన్‌బేస్, జెమిని, క్రిప్టో డాట్ కామ్, బిట్ పాండా ఇంకా ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. దేశీయంగా కూడా ఓలా, బ్లింక్ఇట్, బైజూస్, అన్అకాడమి, వేదాంతు, కార్స్24 సహా అనేక కంపెనీలు ఇప్పటివరకు 12 వేల మందికి ఉద్యోగులను తీసేశాయి. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, సంస్థ పునర్‌నిర్మాణ, ఖర్చుల నిర్వహణ వంటి కారణాలతో ఈ ఏడాది ఇంకా 50,000 మంది స్టార్టప్ ఉద్యోగులు తొలగే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్ని స్టార్టప్‌లు కోట్ల కొద్దీ నిధులను రాబట్టుగలుగుతున్నాయని నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed