దోశ వద్దు శాండ్‌విచ్‌ ముద్దు.. రెస్టారెంట్స్ మెనూలో ఓవెన్ వంటకాలు

by Muthe.Rajitha |

LPG గ్యాస్ సంక్షోభంతో హోటల్స్, రెస్టారెంట్స్ లో దోశ, వడకు బదులుగా ఓవెన్ వంటకాలను మెనూలో చేరుస్తున్నారు నిర్వాహకులు.

దోశ వద్దు శాండ్‌విచ్‌ ముద్దు.. రెస్టారెంట్స్ మెనూలో ఓవెన్ వంటకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా (Middle East)లో చెలరేగిన యుద్ధ జ్వాలలు భారత్ లోని హోటల్స్, రెస్టారెంట్స్ ను తాకాయి. హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ఇంధనం నిండుకొని.. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ (LPG) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనితో హోటల్స్, వాణిజ్య రంగం కుప్పకూలుతోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముంబయి, బెంగుళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే 20 శాతం హోటళ్లు శాశ్వతంగా, తాత్కాలికంగా మూతపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దోశ వద్దు శాండ్‌విచ్‌ ముద్దు

ఈ సంక్షోభం హోటల్స్, రెస్టారెంట్స్ లోని మెనూలను సైతం మార్చివేస్తోంది. గ్యాస్ ఎక్కువగా వినియోగించే దోశ, వడ వంటి దక్షిణ భారత దేశపు ఇష్టమైన వంటకాలను నిర్వాహకులు మెనూ నుంచి తొలగిస్తున్నారు. దోశ పెనం వేడెక్కడానికి ఎక్కువ సమయం, ఇంధనం అవసరం కావడంతో, హోటల్ యజమానులు వీటిని నిలిపివేసి ప్రత్యామ్నాయంగా శాండ్‌విచ్‌లు, ఓవెన్ ఆధారిత వంటకాలు, తక్కువ గ్యాస్ అవసరమయ్యే పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో హోటళ్ల ముందు "గ్యాస్ కొరత వల్ల కొన్ని పదార్థాలు లభించవు" అనే నోటీసు బోర్డులు దర్శనమివ్వడం పర్యాటకులను, స్థానికులను, ముఖ్యంగా బ్యాచిలర్స్ ను ఇబ్బందులకు గురిచేస్తోంది.

కట్టెల పొయ్యిలే గతి!

మరో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఆధునిక కాలంలో మళ్లీ పాత పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా హోటల్ యజమానులు 'కట్టెల పొయ్యిల'ను ఆశ్రయిస్తున్నారు. హోటల్ సిబ్బంది ఫ్లైవుడ్ ముక్కలను, చెక్క సామాగ్రిని పొయ్యిలో వేయడానికి మోసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ఇంధన సంక్షోభాన్ని మాత్రమే కాకుండా, నగరాల్లో కాలుష్య సమస్యను కూడా పెంచే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం త్వరగా ముగియకపోతే, ఈ ప్రభావం మధ్యతరగతి ఇళ్లలోని గృహ అవసరాల సిలిండర్లపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story