- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఆగ్రహం.. 10న కలెక్టరేట్ వద్ద ధర్నా
బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.

దిశ, చేవెళ్ల : బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె. రామస్వామి అధ్యక్షతన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో సామాన్యుడి జీవనం దుర్భరంగా మారిందన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, విదేశీ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని, నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ విస్మరించి, పేదల నడ్డి విరుస్తూ కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇచ్చి వారి ఆదాయాలను పెంచుతోందని ఆరోపించారు.
దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ధరల పెరుగుదల ద్వారా సామాన్య ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు. అదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. ఒకవైపు ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు తగ్గిపోతుండగా, రూపాయి మారకం విలువ కూడా పడిపోతోందన్నారు. మరోవైపు బియ్యం, పప్పులు, నూనెలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో పాటు కూరగాయల ధరలు కూడా సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయని తెలిపారు. ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
2014 మే నెలలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.72 ఉండేదని, అనంతరం ధరలు పెరిగి రూ.111 వరకు చేరాయని పేర్కొన్నారు. అదేవిధంగా డీజిల్ ధర లీటరుకు రూ.55 ఉండేదని, కాలక్రమేణా పన్నుల పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోయి ప్రస్తుతం డీజిల్ ధర కూడా లీటరుకు రూ.103 వరకు చేరిందని తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీపై రేషన్ సరుకులు అందించాలని, మార్కెట్‌లో నల్లబజారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్మికులు, కర్షకులు, రైతులు, పార్టీ శ్రేయోభిలాషులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మక్బూల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, రామన్నగూడెం గ్రామ శాఖ కార్యదర్శి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.






