సీఐ పేరిట కేటుగాడి ఘరానా మోసం ప్రయత్నం..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-07 12:08:17  IST  )

పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి అమాయకులను బురిడీ కొట్టించే సరికొత్త ఆన్‌లైన్ మోసాలకు కేటుగాళ్లు తెరలేపారు.

సీఐ పేరిట కేటుగాడి ఘరానా మోసం ప్రయత్నం..!
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి అమాయకులను బురిడీ కొట్టించే సరికొత్త ఆన్‌లైన్ మోసాలకు కేటుగాళ్లు తెరలేపారు. తాము పోలీసులమంటూ నమ్మించి డబ్బులు గుంజడమే లక్ష్యంగా సాగుతున్న ఈ తరహా దందా హుజూరాబాద్ పట్టణంలో వెలుగుచూసింది. ఓ మహిళ అప్రమత్తంగా వ్యవహరించడంతో సైబర్ నేరగాడి ఉచ్చులో పడకుండా చాకచక్యంగా తప్పించుకుంది.

​అసలేం జరిగిందంటే..?

​బాధితురాలి కథనం ప్రకారం... హుజూరాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డు నివాసి, వ్యాపారి రమేష్ భార్య దాసరి శ్రీలత (42) శనివారం మధ్యాహ్నం సమయంలో తమ సిమెంట్ షాపులో ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 2:58 గంటల ప్రాంతంలో ఆమె మొబైల్‌కు 76598 96370 అనే నంబర్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎస్సై ఫోటో ఉన్న డిబి నుంచి అవతలి వ్యక్తి తాను 'హుజూరాబాద్ ఎస్.ఐ' ని అంటూ పరిచయం చేసుకున్నాడు. ​"మా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు మీతో మాట్లాడమన్నారు.. అర్జంటుగా ఒక 20,000 రూపాయలు పంపించండి" అని సదరు వ్యక్తి శ్రీలతను కోరాడు. అనంతరం మరో నంబర్ (99126 67482) నుండి ఒక క్యూఆర్ కోడ్‌ ను వాట్సాప్‌కు పంపించాడు. ఆ క్యూఆర్ కోడ్‌ను పరిశీలించగా దానిపై 'శ్రేయాన్స్' అనే పేరు ఉంది. నగదు రూపంలో కాకుండా ఆన్‌లైన్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా వెంటనే 20,000 రూపాయలు బదిలీ చేయాలని సదరు వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు.

వరుస ఫోన్లు.. మహిళా వ్యాపారి అప్రమత్తత!

​మొదటిసారి ఫోన్ కట్ చేసిన తర్వాత కూడా సదరు కేటుగాడు వదలకుండా వరుసగా మరో మూడు సార్లు ఫోన్ చేసి, సీఐ గారికి అత్యవసరంగా డబ్బులు పంపాలని గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చాడు. అంతటితో ఆగకుండా నాలుగోసారి కూడా ఫోన్ చేయడంతో శ్రీలతకు తీవ్ర అనుమానం వచ్చింది. సాధారణంగా పోలీసు అధికారులు ఇలా ఫోన్లలో డబ్బులు అడగరని గ్రహించిన ఆమె, ఎలాంటి నగదు పంపకుండా చాకచక్యంగా ఫోన్ కట్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు..

తను సైబర్ మోసానికి గురికాబోతున్నానని గ్రహించిన బాధితురాలు దాసరి శ్రీలత ఆదివారం స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు సమర్పించారు. పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన సదరు గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ నంబర్లపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అపరిచితులకు డబ్బులు పంపొద్దు : సీఐ టి.క‌ర్ణాక‌ర్

​"ప్రజలెవ్వరూ కూడా ఫోన్లలో పోలీసులు, అధికారులు అని చెప్పే మాటలను నమ్మి అపరిచిత వ్యక్తులకు, క్యూఆర్ కోడ్‌లకు డబ్బులు పంపవద్దు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు గానీ సమాచారం అందించాలి" అని సూచించారు.

Next Story