‘ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మా పోరాటం ఆగదు’.. బూర్గంపాడు బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

by Jakkula.Mamatha |

సీతారామ ప్రాజెక్టు విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బూర్గంపాడు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

‘ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మా పోరాటం ఆగదు’.. బూర్గంపాడు బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
X

దిశ,​బూర్గంపాడు: సీతారామ ప్రాజెక్టు విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బూర్గంపాడు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రితో సహా ముగ్గురు మంత్రులు ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్న నేపథ్యంలో, జిల్లా రైతాంగం పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీసులు బూర్గంపాడు మండల బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలపై ప్రశ్నించినందుకు నాయకులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసినప్పటికీ ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వడం ఆనందదాయకమే,కానీ అదే సమయంలో భద్రాద్రి జిల్లా రైతులు ఆగమైపోవాలా?" అని వారు ప్రశ్నించారు. ​​సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న చివరి ఎకరం భూమికి అందే వరకు తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. యావత్ భద్రాద్రి జిల్లా రైతుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టే వరకు ప్రజాక్షేత్రంలో ఉధృతమైన పోరాటాలు చేస్తామని, ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని వారు హెచ్చరించారు.

Next Story