మా బడికి ఉపాధ్యాయుడు కావాలి కలెక్టర్ సారు..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-08 03:37:46  IST  )

ఐదేళ్లుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ చిన్నారుల కిలకిలారావాలతో కళకళలాడుతుందనే ఆశ గ్రామస్థుల్లో చిగురించింది.

మా బడికి ఉపాధ్యాయుడు కావాలి కలెక్టర్ సారు..!
X

దిశ, కారేపల్లి: ఐదేళ్లుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ చిన్నారుల కిలకిలారావాలతో కళకళలాడుతుందనే ఆశ గ్రామస్థుల్లో చిగురించింది. మండల పరిధిలోని గంగారం తండా గ్రామంలో ఇటీవల ఎన్నికైన యువ సర్పంచ్ కిరణ్ ప్రత్యేక చొరవతో,గ్రామ ప్రజల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం జరిగిన రోజున మాత్రమే ఉపాధ్యాయుడిని పంపించిన అధికారులు, ఆ తరువాత 10 రోజులు గడిచినా ఇప్పటికీ శాశ్వతంగా ఉపాధ్యాయుడిని నియమించక పోవడం గ్రామంలో తీవ్ర నిరాశకు దారితీసింది. మాకు చదువు కావాలి. మా బడికి గురువు కావాలి కలెక్టర్ సార్ అంటూ అమాయక విద్యార్థులు ఎదురుచూస్తుండగా, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గ్రామస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫలించకుండా పోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు చేరారు. ప్రభుత్వ బడి పై నమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలను వదిలి తమ పిల్లలను ఇక్కడ చేర్పించిన తల్లిదండ్రులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుడి నియామకం గురించి సంబంధిత విద్యాశాఖ అధికారిని పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించడం లేదని వారు చెబుతున్నారు. గ్రామ సర్పంచ్ కిరణ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిని కేటాయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాం. పిల్లలను చేర్పించాం. కానీ 10 రోజులు గడిచినా ఉపాధ్యాయుడిని పంపించలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్ర స్థాయిలో అమలు కావాలంటే అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పాఠశాలకు శాశ్వత ఉపాధ్యాయుడిని నియమించాలని, అవసరమైతే సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న బడి మళ్లీ మూగబోకూడదు. ఉపాధ్యాయుడు కోసం ఎదురుచూస్తున్న చిన్నారుల కళ్లలోని ఆశను ప్రభుత్వం నిలబెట్టాలని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ను వేడుకుంటున్నారు.

Next Story