ముఖ్యమంత్రికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా?:కేటీఆర్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయం ముఖ్యమా, రైతులు ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా?:కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద వృథాగా లక్షల క్యూసెక్కులు పోతున్నాయని, నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. నీటిని వృథా చేస్తారా అని నిలదీశారు. నిర్లక్ష్యం వహించి.. కాంగ్రెస్ సర్కార్ తమాషా చూస్తున్నదని, అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా అని మండిపడ్డారు. గోదావరి జలాలను ఎత్తిపోసి.. రైతు గోస తీర్చాలనే సోయి లేదా? కేసీఆర్ మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా అన్నారు. మీ పగ ప్రతిపక్షం మీద తీర్చుకోండి అంతే కానీ రైతన్నలను ఆగం చేయవద్దన్నారు.

కాళేశ్వరమే ప్రాణేశ్వరం:

ఎల్ నినో పడగ విప్పుతుంటే..ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ క్రీడలు ఆడుతూ కూర్చుంటారా? అని ప్రశ్నించారు. లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదని విత్తనాలు వేయట్లేదన్నారు. పంటలు సాగుచేసే పరిస్థితి లేని ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారన్నారు. కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా మీ పొలాలను ఎండబెతున్న కాంగ్రెస్ కర్కశ పాలన తీరును రైతులు ప్రశ్నించాలన్నారు. ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ.. కాళేశ్వరమే ప్రాణేశ్వరమై కాపాడుతుందని అర్థం చేసుకోవాలన్నారు.

Next Story