చరిత్ర సృష్టించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు

by Batti.Sumithra |

పేదల పాలిట ధర్మాస్పత్రిగా గుర్తింపు పొందిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు మరోసారి చరిత్ర సృష్టించారు.

చరిత్ర సృష్టించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : పేదల పాలిట ధర్మాస్పత్రిగా గుర్తింపు పొందిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు మరోసారి చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాల (మల్టీ-విసెరల్) ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్న రోగికి ఈ అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రికి రావడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీనిని సవాలుగా స్వీకరించి ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఉస్మానియా వైద్య బృందం సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను మరింత పెంచిందని మంత్రి పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేసిన వైద్యులు, అనస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్, ఇతర సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా వైద్యుల ఘనత నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోందని ఆయన వెల్లడించారు.

Next Story