ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు: ప్రియాంక గాంధీ

by Malleboina Mahesh |

భారత్, అమెరికా ట్రేడ్ డీల్ పై పార్లమెంట్ లో తీవ్ర వివాదం నెలకొంది. అలాగే ఎల్ ఓపీ రాహుల్ గాంధీ దేశ సరిహద్దు భద్రతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు: ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, అమెరికా ట్రేడ్ డీల్ పై పార్లమెంట్ లో తీవ్ర వివాదం నెలకొంది. అలాగే ఎల్ ఓపీ రాహుల్ గాంధీ దేశ సరిహద్దు భద్రతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు స్పీకర్ నిరాకరించడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ ఎంపీలో వెల్ లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియంపై నిలబడి పేపర్లు విసిరారు. దీంతో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై ఈ రోజు ఉదయం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె "హాస్యాస్పదం" (Ridiculous) అని కొట్టిపారేస్తూ, ఇది దేశ ప్రజాస్వామ్యానికే గండమని మండిపడ్డారు.

ప్రజాస్వామ్య హననం

ఎంపీల సస్పెన్షన్ పై ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించి.. ప్రతి సభ్యుడికి తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ఉంటుందని, కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపించారు. మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన అముద్రిత జ్ఞాపకాల్లోని (Memoir) అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించకుండా అడ్డుకోవడంపై ఆమె స్పందించారు. చైనా చొరబాట్ల సమయంలో ప్రధాని, హోం మంత్రి, రక్షణ మంత్రుల స్పందన ఎలా ఉందో ఆ పుస్తకంలోని అంశాలు బయటపెడతాయన్న భయంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే లైంగిక నేరస్థుడైన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రభుత్వ సంబంధాల గురించి సమాచారం ఉందని, అథెంటికేటెడ్ డాక్యుమెంట్లను కూడా సభలో చర్చించనివ్వకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

రాహుల్ గాంధీకి మద్దతు

రాహుల్ గాంధీ ఇప్పటికే పబ్లిష్ అయిన మేగజైన్ కథనాల ఆధారంగానే మాట్లాడుతున్నారని, ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని ధృవీకరించడానికి (Authenticate) సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆమె నిలదీశారు. ఇదిలా ఉంటే నిన్న స్పీకర్ పోడియం వద్ద హంగామ సృష్టించినందుకు కాంగ్రెస్ నుంచి మాణిక్యం ఠాగూర్, హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గురుజీత్ సింగ్ ఔజ్లా, ప్రశాంత్ పాడోలే, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీన్ కురియకోస్, సిపిఎం నుండి ఎస్. వెంకటేషన్‌లను మిగిలిన బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు.

Next Story