- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎఫ్బీలో చాట్.. రూ.కోటి కాజేసిన కిలేడీ
ట్రేడింగ్ లో భారీ లాభాలు వస్తాయనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఏపీకి చెందిన ఓ రిటైర్డ్ టీచర్ కోటి రూపాయలు మోసపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి చెందిన ఓ రిటైర్డ్ టీచర్ సైబర్ నేరగాళ్ల బారిన పడి కోటి రూపాయలు పోగొట్టుకోవడం సంచలనం రేపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రిటైర్డ్ టీచర్ పొన్నం వెంకటేశ్వర్లు గతేడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం మార్టూరు మండలం కోలలపూడిలో నివసిస్తున్నారు. నెల క్రితం 'కందుకూరి మౌనిక' అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక యువతి, తాను యూకేలో ఉంటానని నమ్మబలికింది. త్వరలో భారత్‌కు వస్తానని, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు సాయం కావాలని కోరుతూ ఆయన నమ్మకాన్ని చూరగొంది. ఆపై ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో తన మేనమామ దాసరి నీరజ్‌కుమార్‌కు 16 ఏళ్ల అనుభవం ఉందంటూ, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వెంకటేశ్వర్లును ఈ మాయాజాలంలోకి లాగింది. ఫిబ్రవరి 28న రూ.10 వేలు పెట్టుబడి పెట్టగా, కొద్ది నిమిషాల్లోనే రూ.11,900 అయ్యాయి. అనంతరం రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా రూ.20 వేలు, రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టగా రూ.40 వేల లాభం వచ్చినట్లు చూపించడంతో వెంకటేశ్వర్లు వారిని పూర్తిగా నమ్మేశారు.
అనంతరం 'హర్ష' అనే వ్యక్తిని ఎనలిస్ట్‌గా నియమించుకున్నట్లు నాటకమాడి ఆయనను బురిడీ కొట్టించారు. గ్రూప్ ట్రేడింగ్ పేరుతో తప్పుదోవ పట్టించి, విడతల వారీగా మొత్తం రూ.1,09,05,000 వసూలు చేసిన తర్వాత, లాభాలు పక్కన పెడితే అసలు మొత్తం కూడా తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని ఆయన గ్రహించారు. శనివారం మార్టూరు పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా ఇటువంటి 'ట్రేడింగ్ స్కామ్స్'లో కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా లాభాలు వస్తున్నట్లు గ్రాఫిక్స్‌తో చూపిస్తూ బాధితులను ఊబిలోకి నెడతారు. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన వృద్ధులే వీరి ప్రధాన లక్ష్యం. తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవద్దని, అధిక లాభాల ఆశ చూపే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.






