- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్‌లైన్ భద్రత 'అబద్ధం'.. ఏజెన్సీలో కుంభకోణాల రట్టు
"అంతా ఆన్‌లైన్ చేశాం.. ఎవరూ ఇతరుల భూములను మార్చలేరు.. పారదర్శకంగా మ్యుటేషన్లు జరుగుతాయి.."

దిశ, దమ్మపేట : "అంతా ఆన్‌లైన్ చేశాం.. ఎవరూ ఇతరుల భూములను మార్చలేరు.. పారదర్శకంగా మ్యుటేషన్లు జరుగుతాయి.." రెవెన్యూ ఆన్‌లైన్ పోర్టళ్ల (భూభారతి/ధరణి) గురించి ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న మాటలివి. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదంతా ఒక పెద్ద అబద్ధం అని తేలిపోతోంది. రక్షక కవచంగా నిలవాల్సిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమో, లేక అవినీతి కుమ్మక్కో గానీ.. బతికున్న రైతుల భూములు దర్జాగా పరుల పాలవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను కాపాడేందుకు తెచ్చిన కఠిన చట్టాలను సైతం భూమాఫియా తమకు అనుకూలంగా మలచుకుంటోంది. దమ్మపేట మండలంలో వెలుగుచూసిన ఒక వృద్ధుడి భూమి మ్యుటేషన్ వ్యవహారం.. స్థానిక రెవెన్యూ వ్యవస్థలోని డొల్లతనాన్ని, కళ్లుబైర్లు కమ్మే అవినీతిని బట్టబయలు చేస్తోంది. ఈ ఒక్క ఘటనే కాకుండా, మండలంలో ఇంకెన్ని పచ్చని పొలాలు ఇలా దొడ్డిదారిన కాగితాల్లో చేతులు మారాయో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వారసత్వమే మాఫియాకు ఆయుధం..
దమ్మపేట మండలంలోని పెద్దగొల్లగూడెం తదితర గ్రామాలు పూర్తిగా 1/70 చట్టం అమలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు. ఈ చట్టం ప్రకారం గిరిజనేతర రైతుల మధ్య భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిషిద్ధం. దీనికి తోడు ప్రస్తుతం భూభారతి పోర్టల్‌లో ఏజెన్సీ భూములకు 'పార్టీషన్' (విభజన) విధానం కూడా అందుబాటులో లేదు. దీంతో ఏజెన్సీ భూములను కాజేయాలనుకునే కేటుగాళ్లు పక్కా స్కెచ్ వేశారు. రిజిస్ట్రేషన్లు, పార్టీషన్లు సాధ్యం కాదు కాబట్టి, 'వారసత్వం' (సక్సెషన్) కింద కుటుంబ సభ్యులకు యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే వెసులుబాటును ఆయుధంగా మలచుకున్నారు. 'వారసత్వం' కింద భూమి దక్కాలంటే పట్టాదారుడు చనిపోవాలి. అందుకే అమాయకపు రైతులను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారు బతికుండగానే కాగితాల్లో చంపేసి కథ మొదలుపెడుతున్నారు.
మళ్ళా సత్యం ఉదంతమే సజీవ సాక్ష్యం..
పెద్దగొల్లగూడెం ఏజెన్సీకి చెందిన వృద్ధ రైతు మళ్ళ సత్యం విషయంలో అచ్చం ఇదే జరిగింది. ఆయనకు 5 ఎకరాల సాగు భూమి ఉంది. సత్యానికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ ఆయన భూమిపై కన్నేసిన అక్రమార్కులు.. సత్యం 2018లోనే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. ఆ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని మరో మహిళను ఆయన ఏకైక వారసురాలిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌లో పొందుపరిచి దర్జాగా ఆన్‌లైన్‌లో 5 ఎకరాల భూమిని మ్యుటేషన్ చేసేశారు. ఓటర్ల జాబితా సర్వే లో సత్యం పేరు గల్లంతు కావడంతో ఈ వ్యవహారం యాదృచ్ఛికంగా వెలుగులోకి వచ్చింది.
అధికారుల వాదనల్లోని డొల్లతనం ఇదీ..
బతికున్న మనిషికి వారసత్వ పత్రాలు జారీ చేసి, భూమిని ఎలా మ్యుటేషన్ చేశారని దమ్మపేట తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. "గ్రామ పరిపాలనాధికారి (జీపీవో) నా సంతకాన్ని, ఆర్‌ఐ సంతకాన్ని ఫోర్జరీ చేసింది.. ఆ ఫైలును చూసుకోకుండా డిజిటల్ సైన్ చేశాను" అని బుకాయిస్తున్నారు. ఈ వాదనపై సాంకేతిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ మాన్యువల్ ప్రకారం ఒక మ్యుటేషన్ ఎలా జరగాలో చూస్తే అధికారుల అసమర్థత, లేదా వారి ప్రమేయం ఇట్టే అర్థమవుతుంది.
నోటీసు నిబంధన గాలికి..
ఆన్‌లైన్‌లో సక్సెషన్ దరఖాస్తు రాగానే జీపీవో, ఆర్‌ఐ విచారణ చేసిన అనంతరం.. సంబంధిత పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, గ్రామ పంచాయతీలకు నోటీసులు వెళ్లాలి. 15 రోజుల పాటు ఆ నోటీసులను ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించాలి. మరి మళ్ళ సత్యం భూమి విషయంలో ఈ నోటీసులు ఎందుకు వెళ్లలేదు? వెళ్తే అతను బతికున్నాడన్న సంగతి ఆయా శాఖలకు ఎందుకు తెలియలేదు? కాగితాల మీద సంతకాలు జీపీవో ఫోర్జరీ చేసి ఉండొచ్చు. కానీ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫైల్‌ను ఆమోదించి మ్యుటేషన్ చేయాలంటే తహసీల్దార్ వ్యక్తిగత లాగిన్, బయోమెట్రిక్ లేదా ప్రత్యేకమైన డిజిటల్ కీ తప్పనిసరి. ఈ డిజిటల్ కీ లేకుండా ఆన్‌లైన్ వ్యవస్థలో పోర్జరీ చేయడం సాధ్యం కాదు. మరి తహసీల్దార్ డిజిటల్ కీ వేరొకరి చేతుల్లోకి ఎలా వెళ్లింది..?
దమ్మపేట రెవెన్యూ యంత్రాంగంపై వస్తున్న ఈ తరహా ఆరోపణలు కేవలం మంచుకొండలో ఒక అంచు మాత్రమేనని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అత్యవసరం. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఒక ప్రత్యేక బృందంతో విచారణకు ఆదేశించాలి. గత ఐదేళ్ల కాలంలో దమ్మపేట మండలంలో 'వారసత్వం' కింద జరిగిన మ్యుటేషన్ల రికార్డుల 'చిట్టా' మొత్తం బయటకు తీయాలి. ఐపీ లాగ్స్ పరిశీలించి ఏ సిస్టమ్ నుంచి డిజిటల్ సైన్లు పడ్డాయో నిర్ధారించాలి. ఆయా ఫైళ్లలో పెట్టిన డెత్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల అసలు-నకిలీలను క్షేత్రస్థాయిలో విచారించి క్రాస్ చెక్ చేయాలి. అప్పుడే ఈ నకిలీ వారసత్వాల వెనుక ఉన్న అసలు మాఫియా డొంక కదులుతుంది. లేదంటే కాగితాల్లో సామాన్యులు చనిపోతూనే ఉంటారు, వేల ఎకరాల ఏజెన్సీ భూములు పరుల పాలవుతూనే ఉంటాయి.






