పహల్గామ్ ఘటనకు ఏడాది.. మృతులకు కన్నీటి నివాళులు

by Muthe.Rajitha |   (  Updated:2026-04-22 04:21:13  IST  )

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడికి నేటితో ఏడాది పూర్తవుతోంది.

పహల్గామ్ ఘటనకు ఏడాది.. మృతులకు కన్నీటి నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడికి(Pahalgam Terrorist Attack) నేటితో ఏడాది పూర్తవుతోంది. 2025 ఏప్రిల్ 22న సైనిక యూనిఫామ్‌లో వచ్చిన లష్కరే తోయిబా, 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఉగ్రవాదులు, అమాయక పర్యాటకులే లక్ష్యంగా జరిపిన ఈ కాల్పుల్లో 25 మంది భారతీయులతో పాటు ఒక నేపాలీ పౌరుడు, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2008 ముంబయి దాడుల తర్వాత దేశాన్ని ఇంతలా కుదిపేసిన ఈ ఘోరకలిలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడటమే కాకుండా, పర్యాటక స్వర్గధామంగా పేరొందిన పహల్గాం రక్తసిక్తమైంది. ఈ క్రూర చర్యకు ప్రతిఘటనగా భారత సైన్యం అప్పట్లో 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పాకిస్తాన్ కు ధీటుగా బుద్ది చెప్పింది.

ఈ విషాదానికి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా మృతులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పహల్గాంలోని లిడ్డర్ నది ఒడ్డున మరణించిన 26 మంది పేర్లతో ఒక స్మారక చిహ్నాన్ని (Memorial) నిర్మించి, వారి త్యాగాలను స్మరించుకుంటున్నారు. అటు వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో “The Human Cost of Terrorism” పేరుతో నిర్వహిస్తున్న ప్రదర్శన, పాకిస్తాన్ పోషిస్తున్న ఉగ్రవాదం ఏ విధంగా అమాయక ప్రాణాలను బలితీసుకుంటుందో ప్రపంచానికి చాటిచెబుతోంది. బాధితుల కుటుంబాలకు ఓదార్పునిస్తూ, దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చ్‌లు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానం మరింత కఠినంగా అమలులో ఉందని, అమాయకుల ప్రాణాలు తీసిన వారికి శిక్ష తప్పదని భారత ప్రభుత్వం, సైన్యం ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశాయి.

ఉగ్రవాదానికి తలవంచే ప్రసక్తే లేదు.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు

Next Story