- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1,341 కోట్లతో ఎల్‌ఈడీ మెగా ప్రాజెక్టు.. నగరాల్లో సరికొత్త వెలుగులు
రూ.1,341.60 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల ఆధునికీకరణ.. 2 ఏళ్లలో 7.61 లక్షల పాత లైట్ల స్థానంలో కొత్త ఎల్‌ఈడీ లైట్లు!

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో భద్రతను పెంపొందించడం, ఇంధన పొదుపును సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త వీధి దీపాల ఆధునికీకరణ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న పాత వీధి దీపాల స్థానంలో అత్యాధునిక, అధిక సామర్థ్యం కలిగిన ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. 10 ఏళ్ల సమగ్ర నిర్వహణ కాలపరిమితితో కూడిన ఈ మెగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,341.60 కోట్లుగా నిర్ణయించారు.
7.61 లక్షల ఎల్‌ఈడీ లైట్లు
రాబోయే 2 ఏళ్ల వ్యవధిలో మొత్తం 7.61 లక్షల పాత వీధి దీపాల స్థానంలో కొత్త ఎల్‌ఈడీ ఫిక్చర్‌లను అమర్చాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 34,512 సీసీఎంఎస్ (సీసీఎంఎస్) ప్యానెళ్లను, స్విచ్చింగ్ పాయింట్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెళ్లను కేవలం 6 నెలల్లోపే ఏర్పాటు చేయాల్సి ఉంది. వీధి దీపాల వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, నియంత్రించడం తో పాటు విడివిడిగా రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లకు ‘సెంట్రలైజ్డ్ డాష్‌బోర్డ్’లను ఏర్పాటు చేయనున్నారు.
గతంలో ప్రతి 4,000 వీధి దీపాలకు ఒక మెయింటెనెన్స్ బ్యాచ్ ఉండగా, ఇకపై ఆ నిబంధనను సవరించి ప్రతి 2,500 దీపాలకు ఒక బ్యాచ్‌ను కేటాయించనున్నారు. లైట్ల మార్పిడి దశలో ప్రతి సర్కిల్‌కు ఒకటి చొప్పున మొత్తం 60 హైడ్రాలిక్ క్రేన్లను, ఆ తర్వాత నిర్వహణ కాలంలో కనీసం 30 క్రేన్లను కాంట్రాక్టర్ అందుబాటులో ఉంచాలి. సీసీఎంఎస్ ప్యానెళ్ల నిర్వహణ కోసం ప్రతి సర్కిల్‌కు ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించాలని నిర్ణయించారు. నిరంతరాయంగా కనీసం 98 శాతం వీధి దీపాలు వెలుగుతూనే ఉండాలి.
టెండర్ అర్హతలు..
ఈ ప్రాజెక్టు లో పాల్గొనే లీడ్ బిడ్డర్ (ప్రధాన సంస్థ) కనీసం రూ.400 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఎల్‌ఈడీ స్ట్రీట్ లైటింగ్, సీసీఎంఎస్ ప్రాజెక్టులలో అనుభవం ఉన్న కంపెనీలు/ఓఈఎంలు ఈ టెండర్లకు అర్హులు. నిబంధనలకు లోబడి జాయింట్ వెంచర్లు (జేవీ)/కన్సార్టియంగా ఏర్పడి బిడ్లు దాఖలు చేయవచ్చు.






