- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 33 శాతం లోటు వర్షపాతం
తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు.. 33 శాతం లోటు వర్షపాతంతో పడిపోతున్న భూగర్భ జలాలు, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ అలర్ట్!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో వర్షభావ పరిస్థితులు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత పాతికేళ్లలో లేని కరువు ఈ ఏడాది వచ్చింది. వచ్చే రెండు నెలల్లో వానలు కురిస్తే మెట్ట పంటలు సాగు చేయకున్నా కనీసం బోరు బావుల కింద వరి పంటలు సాగు చేయవచ్చు. ఇప్పటివరకు సాగు చేసిన పత్తి, మిరపతో ఇతర ఆరు తడి పంటలు వాన దేవుని కోసం చూస్తున్నాయి. జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలోని కేవలం ఐదు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది.
మరో 27 జిల్లాలో వర్షపాత లోటు ఉండగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. ఆగస్టు నాటికి వర్షపాతం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో ఇవి మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపాతలోటు, పడిపోతున్న భూగర్భ జలాలు, జలాశయాల్లో డెడ్ స్టోరేజీలు, రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎల్‌నినో కంటింజెన్సీ ప్లాన్ విడుదల చేసింది. ఇందులో రైతులు సాగు చేసే వివిధ రకాల పంటల పై కీలక సూచనలు చేసింది.
30 శాతానికి పైగా..
రాష్ట్రంలో జూన్నుంచి జూలై 14 నాటికి 30.53 లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ములుగు, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం రికార్డు అయింది. 27 జిల్లాల్లో లోటు, హన్మకొండ జిల్లాలో అతి తక్కువ లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే 358 మండలాల్లో లోటు వర్షపాతం, 85 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం రికార్డు అయింది. 142 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు కూడా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. అయితే, సాధారణ వర్షపాతం నమోదైన మండలాల్లోనూ ఒకటి రెండు భారీ వర్షాలు పడటంతో అలా కనిపిస్తున్నప్పటికీ ఆ ప్రాంతాల్లోనూ కరువు ఛాయలే కనిపిస్తున్నాయి.
ఆరుతడి పంటలే మేలు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు తక్కువ నీరు అవసరమయ్యే చేసే పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. నీటి ఎద్దడి తట్టుకునే కంది, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, పండ్లు, కూరగాయాల వంటి పంట రకాలను సాగు చేయాలని కోరుతోంది. పంట పొలాల్లోనే తేమను సంరక్షించడం, వర్షపు నీటిని సేకరించే పద్ధతుల ద్వారా ప్రతి వర్షపు నీటి చుక్కను కాపాడుకోవాలి. వాతావరణ శాఖ వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలను పాటిస్తూ దానికి అనుగుణంగా పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి. భూగర్భ జలాలను సంరక్షించడానికి బిందు, తుంపర సేద్యం వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలను అమలు చేయాలి.
వీలైనన్ని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని సేకరించి అందులో నిల్వ చేసుకోవాలి. వరి సాగు 25 శాతానికి తగ్గించుకుని మిగతా పొలంలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ప్రాజెక్టుల నుంచి వ్యవసాయానికి సరిపడా నీరు వచ్చి చేరే అవకాశం లేనందుకు ఆయకట్టు కింద కూడా ఆరుతడి పంటలు సాగు చేయాలి. మెట్ట భూముల్లో, తడిపొడిగా తడిసిన నేలల్లో ఎరువులను వేయకూడదు. వీలైనంత మేరకు కలుపు నివారించి పంట చేనులో నీటి శాతం తక్కువ కాకుండా చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
పడిపోతున్న భూగర్భ జలమట్టాలు
జూన్ మాసంలో సగటు భూగర్భ జలమట్టం భూ మట్టానికి 9.46 మీటర్ల దిగువకు పడిపోయింది. ఖమ్మం జిల్లాలో సగటు కంటే 5.46 మీటర్ల లోతుకు పోగా వికారాబాద్ జిల్లాలో 13.30 మీటర్ల అత్యంత లోతులో నీటిమట్టం ఉంది. 20 జిల్లాల్లో 5 నుండి 10 మీటర్ల లోతులో భూగర్భజలాలు పడిపోగా, 13 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జులైలో 10.35 మీటర్ల అడుగు భాగానికి, ఆగస్టు నాటికి 11.01 మీటర్ల అడుగుకు పడిపోయే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. మే నెల నుంచి వచ్చే ఆగస్టు నాటికి 1.74 మీటర్ల లోతునకు పడిపోతుందని వ్యవసాయ శాఖ తెలిపింది. ఆగస్టులో అత్యంత లోతైన భూగర్భ జలమట్టాలు వికారాబాద్ (15.60 మీటర్లు), మెదక్ (15.20), సంగారెడ్డి (15.09 ), నిజామాబాద్ (14.60), సిద్దిపేట 14.28 మీటర్లుకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.






