మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

by Ratna Kumari |

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కామారెడ్డి జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
X

దిశ, కామారెడ్డి: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కామారెడ్డి జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిపాలన, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులు, యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసు శాఖకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, జిల్లా సంక్షేమ అధికారి ఐ. ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story