ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలి

by Ratna Kumari |

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు.

ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలి
X

దిశ, సుల్తానాబాద్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీకి పోలీసు గౌరవ వందనం అందించారు. అనంతరం సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచుగా తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఐకి ఆదేశించారు.

రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారి తాజా వివరాలను నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంగా స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తూ, పోలీసు శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణ, పారదర్శకతతో సేవలు అందించాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ నేరాలు, సామాజిక సమస్యలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని వివరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం డీసీపీ పోలీసు అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్‌రావు, సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story