ఇచ్చట జైలు అద్దెకు ఇవ్వబడును.. నెటిజన్స్ షాక్

by Muthe.Rajitha |   (  Updated:2026-05-01 12:04:34  IST  )

హైదరాబాద్‌లోని చంచలగూడ సెంట్రల్ జైలులో "ఒక రోజు జైలు జీవితం" అనే వినూత్న కార్యక్రమాన్ని రానున్న మే నుండి ప్రారంభించబోతున్నారు.

ఇచ్చట జైలు అద్దెకు ఇవ్వబడును.. నెటిజన్స్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జైళ్ల శాఖ వింత నిర్ణయంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా నేరస్తులు, విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు జైళ్లలో మగ్గుతూ ఉంటారు. అంయితే సాధారణ జనానికి అసలు జైలు లోపల ఎలా ఉంటుందో తెలిసే అవకాశమే లేదు. ఈ క్రమంలో కామన్ పీపుల్ కు జైలు జీవితం రుచి చూపించబోతోంది జైళ్లశాఖ. హైదరాబాద్‌లోని చంచలగూడ సెంట్రల్ జైలు వేదికగా "ఒక రోజు జైలు జీవితం" అనే వినూత్న కార్యక్రమాన్ని రానున్న మే మొదటి వారం నుండి ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ప్రకారం.. నేరం చేయని సామాన్య పౌరులు కూడా కేవలం రూ.500 ఫీజు చెల్లించి, 24 గంటల పాటు ఒక అసలైన ఖైదీలా జైలులో గడపవచ్చు. ఇది వినడానికి వినోదంగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఉన్న నిబంధనలు మాత్రం అత్యంత కఠినంగా ఉన్నాయి. జైలులోకి వెళ్లే వ్యక్తి తన వ్యక్తిగత దుస్తులను వదిలివేసి, అధికారులు ఇచ్చే ఖద్దరు యూనిఫామ్‌ను మాత్రమే ధరించాలి. అంతేకాకుండా మొబైల్ ఫోన్లు, వాచీలు లేదా మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు.

చారు అన్నం.. కటిక నేల మీద నిద్ర

జైలు అనుభవం కేవలం గదిలో కూర్చోవడానికి మాత్రమే పరిమితం కాదు. అక్కడ ఉన్న ఖైదీల మాదిరిగానే తెల్లవారుజామునే నిద్రలేవడం, జైలు మెనూ ప్రకారం అందించే పప్పు, అన్నం, చారు వంటి సాదా సీదా భోజనాన్ని తినడం, అధికారులు కేటాయించే పనులు అంటే జైలు ఆవరణ శుభ్రపరచడం, తోటపని వంటివి స్వయంగా చేయాల్సి ఉంటుంది. పడుకోవడానికి మంచం, పరుపులు ఉండవు. కేవలం నేలపై చాప వేసుకుని, ఒక దుప్పటి మరియు దిండుతో మాత్రమే రాత్రి గడపాలి. స్వేచ్ఛ లేని జీవితం ఎంత భారంగా ఉంటుందో, కఠిన కారాగార నియమాల మధ్య బతకడం ఎంత కష్టమో సామాన్య ప్రజలకు అర్థం కావాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా నేరాల బాట పట్టే ఆలోచన ఉన్నవారికి, జైలులో కఠిన జీవితం ముందే చూపించి వారిలో పరివర్తన తీసుకురావాలని జైలు శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు

కాగా ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిని ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగంగా, క్రమశిక్షణను నేర్పే పాఠంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జైలు అనేది నేరగాళ్లను శిక్షించే, మార్పు తెచ్చే స్థలం అని, అటువంటి పవిత్రమైన వ్యవస్థను కేవలం 'టూరిజం స్పాట్'గా మార్చడం వల్ల నేరాల పట్ల ఉన్న భయం పోతుందని విమర్శకులు వాదిస్తున్నారు. జైలు శిక్షను ఒక వినోద కార్యక్రమంగా మార్చడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, 24 గంటల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకుని, ఒక ఖైదీగా ఉండాలనే ఈ వినూత్న ప్రయోగానికి హైదరాబాద్ జనం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మీకూ ఒకరోజు జైలు జీవితం గడపాలని ఉంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే చంచల్ గూడ జైలు అధికారులను కలవండి.

Next Story