ఆయిల్ ఫామ్ సాగును మరింత విస్తరించాలి

by Ratna Kumari |

దీర్ఘకాలికంగా లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగును జిల్లాలో మరింతగా విస్తరించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఆయిల్ ఫామ్ సాగును మరింత విస్తరించాలి
X

దిశ, కరీంనగర్ : దీర్ఘకాలికంగా లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగును జిల్లాలో మరింతగా విస్తరించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. రైతు వేదికలు, గ్రామపంచాయతీల ద్వారా ఆయిల్ ఫామ్ సాగుతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ రాయితీలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మండలాలు, గ్రామాల వారీగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు, ఆసక్తి ఉన్న రైతుల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటూ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

అవసరమైతే జిల్లాలోనే ఆయిల్ ఫామ్ నర్సరీ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే లాభాలు పొందుతున్న రైతుల తోటలకు ఇతర రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో గత నాలుగేళ్లలో 2,640 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటగా, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 767 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి కాగా, 180 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ఆయిల్ ఫామ్‌కు అవసరమైన డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, సన్నకారు రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 450 ఎకరాల్లో పంట కోతకు వచ్చి 850 మెట్రిక్ టన్నుల దిగుబడి లభించగా, టన్నుకు రూ.23,783 చొప్పున చెల్లింపులు వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story