- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉలకరు పలకరు.. స్వర్గసీమ అక్రమాలపై అధికారుల మౌనం!
అవిగో అక్రమ నిర్మాణాలు.. ఇవిగో నోటీసులు.. అంటూ స్వర్గసీమ వెంచర్ విషయంలో అధికారులు చేసిన హడావుడి అంతా ఉట్టిదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: అవిగో అక్రమ నిర్మాణాలు.. ఇవిగో నోటీసులు.. అంటూ స్వర్గసీమ వెంచర్ విషయంలో అధికారులు చేసిన హడావుడి అంతా ఉట్టిదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా చెర్కుపల్లిలోని ‘సుకేతన’ వెంచర్ అక్రమాలపై ఏకంగా పంచాయతీ పాలకవర్గంతో పాటు స్థానిక రైతాంగం లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారుల్లో ఉలుకూపలుకూ లేదు. ఇటీవల విచారణ జరిపిన డీఎల్‌పీవో వరలక్ష్మి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో గ్రామ సభ నిర్వహించి అందరికీ న్యాయం చేస్తామన్న ఆమె వాగ్దానం సైతం ఆచరణకు నోచుకోలేదు. నిర్మాణాలు అక్రమమని నోటీసులు ఇవ్వడం? ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
నాటకీయ పరిణామాలతో ఫిబ్రవరి 17న మొదటి నోటీసు..
స్వర్గసీమ సుకేతన వెంచర్‌లో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా క్లబ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారని చెర్కుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి 2026 ఫిబ్రవరి 17న వెంచర్ నిర్వాహకులకు మొదటిసారిగా (నోటీసు నెం.జీపీ/01/2026)ను జారీ చేశారు. పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 114 ప్రకారం నేరమని, నోటీసు అందిన వెంటనే అట్టి నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా నోటీసులో ఆదేశాలిచ్చారు. లేనియెడల పంచాయతీరాజ్ చట్టం 114(1), (8) తోపాటు సెక్షన్ 113 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రహరీకి సంబంధించి మరో నోటీసును అదే తేదీన(నోటీస్ నెం.జీపీ/02/2026) జారీ చేశారు. హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా ప్రహరీని లే అవుట్ చుట్టూ నిర్మాణం చేశారని.. కేవలం లే అవుట్ మాత్రమే కావడం వల్ల పంచాయతీరాజ్ చట్టం -114 ప్రకారం ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టడం నేరమని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన తక్షణమే ప్రహరీ నిర్మాణాన్ని తొలగించుకోవాలని, లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం 114(8) ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మార్చి 2న రెండో నోటీసు..
మొదటిసారి జారీ చేసిన నోటీసులకు సుకేతన వెంచర్ నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి 2026 మార్చి 2న రెండోసారి మరో రెండు నోటీసు(జీపీ/03/2026)లను జారీచేశారు. గత నోటీసులకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వనందున పై అధికారుల సూచనల మేరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
మార్చి 16న గడువు కోరుతూ లేఖ..
సుకేతన వెంచర్‌లో తాత్కాలికంగా చేపట్టిన కార్యాలయ నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశామని, సర్టిఫికెట్ రావడానికి 45 రోజుల సమయం పడుతుందని అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ సుకేతన యాజమాన్యం 2026 మార్చి 16న పంచాయతీ కార్యదర్శికి ఓ లేఖను పంపింది. వారు కోరిన గడువు పూర్తయింది. కానీ.. ఇప్పటివరకు అనుమతులు పొందినట్టు ఎటువంటి పత్రాలు అధికారులకు సమర్పించలేదు.
జూన్ 9న డీఎల్‌పీవో విచారణ..
సుకేతన యాజమాన్యం గ్రామ పంచాయతీకి ఇచ్చిన 10 శాతం ల్యాండ్ ఎక్కడ ఉందో! చూపెట్టాలంటూ చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎంపీడీవోకు ఫిర్యాదు చేసింది. చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టి పాలకవర్గాన్ని సైతం లోపలకు అనుమతించకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారంటూ పాలకవర్గం ఫిర్యాదు చేసింది. ప్రహరీ నిర్మించి తాత ముత్తాతల నాటి నుంచి ఉన్న బండ్ల బాటను మూసివేయడం వల్ల పొలాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నామంటూ స్థానిక రైతులు కొందరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపేందుకు షాద్‌నగర్ డీఎల్‌పీవో వరలక్ష్మి జూన్ 9న సుకేతన వెంచర్‌ను సందర్శించింది.
పాలకవర్గం, రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రీ కాస్ట్ వాల్‌కు సంబంధించిన కొన్నింటిని తొలగించేందుకు సుకేతన యాజమాన్యం ఒప్పుకుందని, ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వారిని కోరినట్టు డీఎల్‌పీవో ఈ సందర్భంగా చెప్పారు. వారం రోజుల్లో గ్రామ సభ పెట్టి అందరి సమక్షంలో చర్చిద్దామని కూడా ఆమె చెప్పారు. అయితే, ఇప్పటివరకు గ్రామసభను నిర్వహించలేదు. అంతేకాదు.. విచారణకు సంబంధించి జిల్లా అధికారులకు సైతం ఎటువంటి నివేదికను సమర్పించలేదు. సీరియస్‌గా వ్యవహరించాల్సిన జిల్లా అధికారులు సైతం ‘మామూలు’గానే తీసుకోవడం విస్మయం గొలుపుతోంది.
ఇంకెన్నాళ్లీ నాన్చివేత..
అక్రమ నిర్మాణాలు అని తేల్చి అధికారులే నోటీసులు ఇచ్చారు. ఏకంగా పాలకవర్గం సైతం తీవ్ర ఆరోపణలు చేస్తూ సుకేతన వెంచర్‌పై ఫిర్యాదులు చేసింది. స్థానిక రైతాంగం సైతం సుకేతన యాజమాన్యం వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చే విషయంలో కాలయాపన చేస్తుండటం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. వారి తీరు ఇలాగే ఉంటే.. అధికారుల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించేందుకు స్థానికులు సిద్దమవుతున్నట్టు తెలిసింది.
విచారణ నివేదిక రాలేదు: సురేష్ మోహన్, జిల్లా పంచాయతీ అధికారి
సుకేతన వెంచర్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారించాల్సిందిగా డీఎల్‌పీవోను ఆదేశించాం.కానీ, విచారణకు సంబంధించిన నివేదిక ఇంకా అందలేదు. నివేదిక వచ్చాక తదుపరి చర్యలపై సరైన నిర్ణయం తీసుకుంటాం.






